మీకో 30 నుంచి 40 ఏళ్లు ఉంటాయా? వేసవి సెలవులు అంటే ఏం గుర్తొస్తుంది మీకు?.. అమ్మమ్మ వాళ్ల ఇంటికో.. ఊళ్లో ఉన్న బాబాయి వాళ్లింటికో వెళ్లడం.. అక్కడి ఫ్రెండ్స్‌తో గోళీలు ఆడటం, చెరువులో ఈత కొట్టడం, తోటల్లో కోతి కొమ్మచ్చి ఆడటం, రాత్రిళ్లు అమ్మమ్మో, తాతయ్యో చెప్పే కథలు వింటూ పడుకోవడం.. అసలు రోజు ఎలా గడిచిపోయేది కూడా తెలిసేది కాదు కదా! మరి ఇప్పుడు.. సమ్మర్ హాలిడేస్ అంటే టఫ్ సబ్జెక్ట్స్కుస్పెషల్ ట్యూషన్సో, కంప్యూటర్ కోర్సో, కోడింగ్ కోర్సో నేర్చుకోవడం.. పొద్దున్నే సంగీతం క్లాసులకో, డ్యాన్స్ క్లాసులకో వెళ్లడం, సమ్మర్ క్యాంపులో ఉండటం ఇలా మారిపోయాయి.
ఈ మధ్య వచ్చిన విపరీత ధోరణి ఏమిటంటే.. ఈ వేసవి సెలవుల్ని వేస్ట్ చేయొద్దు, మా బ్రిడ్జి కోర్స్‌కి పంపించండి అంటూ స్కూల్స్, కాలేజీల నుంచి ఫోన్లు వస్తున్నాయి. పది, పదిహేను రోజుల్లో మీ పిల్లలను సూపర్ కిడ్స్‌గా మార్చేస్తాం మా సమ్మర్ క్యాంపునకు పంపించండి అంటూ వ్యక్తిత్వ వికాస నిపుణులు, సైకాలజిస్టులు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ సోషల్ మీడియాలో ఊదరగొట్టేస్తున్నారు. స్కూల్స్‌కి, కాలేజీలకు సెలవు ఇచ్చిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఇదే గోల. ఈ క్యాంపులకు పిల్లల్ని పంపించకపోతే ఏదో మిస్ అయిపోతారేమో అని పేరెంట్స్‌లో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ (ఫోమో)ని క్రియేట్ చేయడం జరుగుతున్నది.
అసలు వేసవి సెలవులు ఎందుకు? వాటి వల్ల పిల్లలకు వచ్చే ప్రయోజనం ఏంటి? పేరెంట్స్‌గా మనం ఏం చేయొచ్చు? అని ఒకసారి ఆలోచించండి. వేసవి సెలవులు కేవలం ఒక విరామం మాత్రమే కాదు, పిల్లల మానసిక, శారీరక వికాసానికి ఎంతో అవసరం. నేటి ఉరుకుల పరుగుల విద్యా విధానంలో, పుస్తకాల మోతతో సతమతమవుతున్న పిల్లలకు వేసవి సెలవులు ఒక అమృత ఘడియల్లాంటివి. ఏటా ఎండలు పెరగగానే స్కూళ్లకు సెలవులు ఇవ్వడం వెనుక కేవలం వాతావరణ మార్పులే కాకుండా, లోతైన కారణాలు కూడా ఉన్నాయి.

Summer
1. మెదడుకు విశ్రాంతి
యంత్రంలా రోజూ చదువుకోవడం వల్ల పిల్లల మెదడు అలసిపోతుంది. సెలవులు వారి మెదడుకు కావాల్సిన విశ్రాంతినిస్తాయి. ఈ విరామం తర్వాత వారు మళ్లీ పాఠశాలకు వెళ్లినప్పుడు కొత్త ఉత్సాహంతో, మెరుగైన ఏకాగ్రతతో పాఠాలు వినగలుగుతారు.
2. సృజనాత్మకతకు వేదిక
స్కూలులో కేవలం సిలబస్ మీద దృష్టి పెడతారు. సెలవుల్లో పిల్లలు ఆడుకునే ఆటలు ఇది వారిలోని సృజనాత్మకత, టీమ్ వర్క్, లీడర్ షిప్ క్వాలిటీస్‌ని బయటికి తీస్తాయి.
3. సామాజిక అనుబంధాలు
చాలామంది పిల్లలు సెలవుల్లో అమ్మమ్మ, తాతయ్యల ఊళ్లకు వెళ్తుంటారు. అక్కడ బంధువులతో గడపడం వల్ల కుటుంబ విలువల పట్ల అవగాహన పెరుగుతుంది. సామాజికంగా ఎలా మెలగాలో తెలుస్తుంది. సెల్ఫోన్లకు దూరంగా ఉండి, తోటి పిల్లలతో ఆడుకోవడం వల్ల సామాజిక నైపుణ్యాలు మెరుగవుతాయి.
4. శారీరక ఆరోగ్యం
రోజూ స్కూల్ వ్యాన్లలో ప్రయాణించే పిల్లలకు, మైదానంలో ఆడుకునే అవకాశం సెలవుల్లోనే ఎక్కువగా లభిస్తుంది. ఎండ తీవ్రత తక్కువగా ఉన్న సమయంలో ఆడుకోవడం వల్ల శారీరక దారుఢ్యం పెరుగుతుంది.
5. ఒత్తిడి నుంచి విముక్తి
ర్యాంకులు, గ్రేడ్లు, హోంవర్క్ అనే ఒత్తిడి నుండి పిల్లలకు ఈ నెలన్నర రోజులు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. ఈ స్వేచ్ఛ వారిని మానసిక ప్రశాంతత వైపు నడిపిస్తుంది. చదువు ఒక్కటే జీవితం కాదు, జీవితాన్ని ఆస్వాదించడం కూడా ఒక చదువే అని పిల్లలు తెలుసుకోవడానికి వేసవి సెలవులు ఉత్తమ సమయం.
ఆటల్లో ఏముంది?
వేసవి సెలవుల్లో పిల్లలు ఎటువంటి ప్రణాళిక లేని ఆటలు ఆడటం వల్ల వారి మెదడు అభివృద్ధిపై సానుకూల ప్రభావం చూపుతుంది.

Summer
1. కార్యనిర్వాహక విధుల మెరుగుదల
పిల్లలు తమంతట తాముగా ఆటలు ఆడుకుంటున్నప్పుడు, ఒక సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తారు. మట్టితో ఇల్లు కట్టేటప్పుడు అది పడిపోతే, మళ్లీ ఎలా కట్టాలో వారే నిర్ణయించుకుంటారు. ఇది మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ భాగాన్ని ప్రేరేపించి, నిర్ణయాధికారం, ప్రణాళికా నైపుణ్యాలను పెంచుతుంది.
2. కొత్త నరాల అనుసంధానం
కొత్తగా ఆలోచించి ఆడే ఆటలు మెదడులో కొత్త సినాప్సిస్ ఏర్పడటానికి తోడ్పడతాయి. పరిగెత్తడం, దూకడం, దాగుడుమూతలు లాంటివి మెదడులోని సెరిబెల్లమ్ భాగాన్ని ఉత్తేజితం చేసి.. శారీరక సమతుల్యత, ఏకాగ్రతను పెంచుతాయి.
3. సృజనాత్మకత, ఊహాశక్తి
ఎలాంటి బొమ్మలు లేకపోయినా కేవలం కర్రలు, రాళ్లతో ఆడుకునేటప్పుడు ఊహాశక్తి పెరుగుతుంది. ఒక వస్తువును మరొక వస్తువుగా ఊహించుకోవడం వల్ల మెదడులో అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అభివృద్ధి చెందుతుంది.
4. సామాజిక, భావోద్వేగ నియంత్రణ
సమూహంగా ఆడుకునేటప్పుడు తమ వంతు వచ్చే వరకు వేచి ఉండటం, ఇతరులతో సర్దుకుపోవడం నేర్చుకుంటారు. ఇది వారిలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరగడానికి దోహదపడుతుంది.
5. ఒత్తిడి తగ్గింపు
పరీక్షలు, పాఠాల ఒత్తిడి లేని ఈ స్వేచ్ఛాయుతమైన ఆటలు మెదడులో డోపమైన్ వంటి సంతోషాన్ని ఇచ్చే హార్మోన్లను విడుదల చేస్తాయి. ఇది పిల్లలను మానసికంగా దృఢంగా మారుస్తుంది.

Summer
ఇవి నేర్పించండి..
పిల్లలు నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఏ క్యాంపులు అవసరం లేదు. వారితో సమయం గడపండి, కొన్ని అలవాట్లు నేర్పించండి చాలు. అవే వారిని మంచి దారిలో నడిపిస్తాయి.
మానసిక వికాసం కూడా..
పిల్లలు తమంతట తాముగా, ఎటువంటి పెద్దల పర్యవేక్షణ లేదా కఠినమైన నిబంధనలు లేకుండా ఆడుకున్నప్పుడు వారిలో కొన్ని మార్పులు వస్తాయి.
బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, హైదరాబాద్, 99854 28261