ఆ అమ్మాయికి పాటంటే ప్రాణం. పాఠమన్నా ఇష్టమే. ఈ రెంటిలో ఏదైనా సరే, ఒక్క సారి వింటే చాలు గుర్తుపెట్టుకుంటుంది. అందుకే ఉపాధ్యాయులు బహుమతులిచ్చి మెచ్చుకున్నారు. బాగా చదవాలని వెన్ను తట్టారు. కానీ ఇంట్లో చదువు ఆపాలన్నారు. పెండ్లి చేసి ప్రతిభకు శిక్ష వేశారు. అమ్మానాన్నల ఎడబాటువల్ల అందమైన బాల్యాన్ని కోల్పోయిన ఆ అమ్మాయి చిన్ననాడే పాటతో స్నేహం చేసింది. కానీ తన వైవాహిక జీవితంలోనూ అదే రకమైన తుఫాను. ఆ ఒడుదొడుకుల్లోనూ తడబడకుండా పాటపై పరిశోధన చేసింది. జానపదాలంటే తెలుగు పాటలే కాదు ఉర్దూ పాటలూ ఉంటాయని ఎరుకజేసింది. డోలక్ కీ గీత్‌ని ఎల్లలు దాటించి, జీవన గీతానికి ప్రాణం పోసింది హైదరాబాదీ మహిళ డాక్టర్ సమీనా బేగం!
మాది మియాపూర్. బంజారాహిల్స్‌లోని జహెరా నగర్లో ఉండే అమ్మమ్మ వాళ్లింట్లో పెరిగిన. ఉర్దూ మీడియం బడిలో చదివిన. మా కుటుంబంలో పదో తరగతి మొదటగా పాసైంది నేనే! ఇంటర్మీడియెట్ చదవాలని కోరిక. ఇంట్లో ఒప్పుకోలె. టోలిచౌకీలో ఉన్న ఓ భవనంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, దూరవిద్యా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ఉండేది. అక్కడికి పోయి బీఏలో చేరిన. ఫస్ట్ ఇయర్లో.. ఆదివారం రోజున క్లాస్‌కి పోయిన. నన్ను వెతుక్కుంటూ మా అమ్మ వచ్చింది. ‘నువ్వు రా. వచ్చే శుక్రవారం నీ పెళ్లి’ అన్నది. ‘నేను చదువుకుంట. మా వాళ్లు పెళ్లి చేస్తామంటున్నరు. వద్దని చెప్పండి’ అని ప్రొఫెసర్ అమీనా తహస్సీన్ని అడిగిన. ‘ఇది మీ కుటుంబ వ్యవహారం.
నేను చేసేదేమీ లేదు. చదువుకోవాలని ఉంటే మెటీరియల్ పంపిస్తా. అడిగితే సాయం చేస్తా. అవసరమైతే ఫోన్ చేయ్’ అని మా మేడం అన్నది. అమ్మ ఇంటికి తీసుకొచ్చింది. మా చుట్టాలకు తెలిసినబ్బాయి మహ్మద్ ఇమ్రాన్‌తో పెళ్లి జరిగింది. ఆయన హోటల్లో పని చేసిండు. పెళ్లి నాటికి ఆటో నడుపుతున్నడు. తనకు చాలా అవలక్షణాలున్నయి. గుట్కా తింటడు. మందు తాగుతడు. పెళ్లి తర్వాత ఒకరోజు తాగొచ్చిండు. బాధపడ్డ. రెండోసారి తాగొచ్చిండు. ఆ రోజు.. ఇంకోసారి తాగి వస్తే నువ్వెవరో, నేనెవరోనని చెప్పిన. మద్యం మానేసిండు.
మూడో తరగతి చదివేప్పుడు మా క్లాస్‌ని అయిదో తరగతి వాళ్లతో కలిపారు. అయిదో తరగతి పాఠంలో గేయాన్ని అడిగితే ఆ తరగతి వాళ్లెవరూ చెప్పలేదు. నేను చెబుతానంటే.. నువ్వు చాలా చిన్నదానివన్నది టీచర్. అయినా చెబుతానని ధైర్యంగా చెప్పిన. అంతా ఆశ్చర్యపోయారు. తొమ్మిదేండ్ల వయసులోనే కవిత్వం రాసిన. దాన్ని చూసి మా టీచర్ ‘బేటీ.. బాగా రాసినవ్’ అని మెచ్చుకుని ఓ పుస్తకం బహుమతిగా ఇచ్చింది. అప్పట్నుంచి రాస్తనే ఉన్న. కథలూ రాసిన. పత్రికల్లో అచ్చయినయ్. చదువు విలువ గురించి ఓ కథ రాసిన. మగవాళ్లు ఎక్కడికైనా పోయే అవకాశం ఉందని, అందువల్ల ఏ పనైనా చేయగలరని, ఆడపిల్ల మాత్రం చదివితేనే పని చేయగలదని ఓ కథ రాశాను. ‘ఈ కథ బాగుంది’ అని మా ఆయన కూడా మెచ్చుకున్నడు.
అప్పుడు నేను చదువుకుంటానని అడిగితే ఆయన కాదనలె. ఇంట్లోనే చదువుకుంటున్న. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ నాటికి ప్రెగ్నెంట్‌ని. సెకండ్ ఇయర్ ఎగ్జామ్ నాటికి కొడుకు పుట్టిండు. పరీక్షలకు పోతానంటే.. ‘ఆరు రోజుల పిలగాడున్నడు. ఎట్లపోతవ్’ అని ఇంట్లోవాళ్లు వద్దన్నరు. మా ఆయన మాత్రం వద్దనలె. తనే ఆటోలో పరీక్షకు తీస్కపోయిండు. ఆయన పాలడబ్బాతో పిలగాడికి పాలుపట్టి ఆడిస్తే.. నేను పరీక్ష రాసి వచ్చిన. మూడేండ్లకు డిగ్రీ చేతికొచ్చింది. మొత్తం మాకు ముగ్గురు పిల్లలయ్యారు. వాళ్లే నా ప్రపంచం.
ఆయన ఆటోనడిపితే వచ్చే ఆదాయంతో ఇల్లు గడవడం కష్టంగా ఉంటుండె. మౌలాలిలో మా ఇంటికి దగ్గర్లో పిల్లల్ని ఆడమ్స్ స్కూల్లో చేర్పించిన. అందులోనే ఉర్దూ టీచర్‌గా చేరిన. ట్యూషన్లు చెప్పిన. ఇద్దరి సంపాదనతో సంసారం సాగిపోతుండె. అంతా బాగుందనుకున్న సమయంలో ఇంకో కల్లోలం ఎదురైంది. మా ఆయన మనసు మారింది. మమ్మల్ని వదిలిపెట్టి పోయిండు. కాస్త మంచిగ బతకాలంటే చదువుండాలె. అందుకే, డిగ్రీ అయిన ఆరేళ్ల తర్వాత ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో ఎంఏ ఊర్దూలో చేరిన.
ఓ రోజు… ప్రొఫెసర్ నసీముద్దీన్ గారు క్లాస్‌కి వచ్చి.. ‘బెంగళూరులో ఉర్దూ కాన్ఫరెన్స్ ఉంది. డోలక్ కీ గీత్కి ప్రిపేర్కండి’ అన్నడు. ఆ కార్యక్రమానికి పోవాలని నాకు ఆసక్తి ఉంది. చిన్నప్పుడు రేడియోలో డోలక్ కీ గీత్ వస్తుందని మా నానీ అజుబజు (ఇరుగు పొరుగు) వాళ్లని పిలిచి కూర్చోబెట్టేది. నేనూ అందరితోపాటు కూర్చునేది. వింటూనే ఆ పాటలు రాసుకున్న. తొమ్మిదో తరగతి నుంచి నేను రాసిన కవితలు, ఆ సార్‌కి చూపించిన. ‘నీ దగ్గర భలే ఖజానా ఉంది’ అని మెచ్చుకున్నడు. నేను పాడగలను. నా దగ్గర పాట రెడీగా ఉంది. కానీ, నాతోపాటుగా పాడేందుకు మరో ఇద్దరైనా కావాలి. మా క్లాస్‌లో మిగతావాళ్లకు ‘డోలక్ కీ గీత్’ తెలియదు. అందువల్ల అప్పుడు డోలక్ కీ గీత్ ప్రదర్శన కుదరలేదు.
పీజీ తర్వాత… డోలక్ కీ గీత్ గురించి ఎంఫిల్ చేస్తానని బీబీ రజాక్ హాతూన్ సార్‌తో అన్నా. ఆయన వెంటనే ‘సూపర్ ఐడియా’ అన్నరు. గుల్బర్గా, వరంగల్, బీదర్ నగరాలతోపాటు చుట్టుపక్కల గ్రామాలు తిరిగిన. ఫంక్షన్లు, పెండ్లిళ్లకు పోయి అక్కడ పాడేవాళ్లని కలిసిన. వాళ్లతో మాట్లాడిన. ఇంటర్వ్యూ తీసుకున్న. చిల్లా చుట్టీ (బారసాల), అన్న ప్రాశన, మెహందీ, హల్ది, సాంచక్ (అబ్బాయి ఇంటి నుంచి పసుపు, మెహందీ, ఆభరణాలు, దుస్తులు పంపే వేడుక), పెండ్లి, వలీమా వేడుకల్లో పాడే పాటలన్నీ రికార్డు చేసుకున్న. గ్రామాల్లో వివిధ రకాల పనులు చేస్తూ పాటలు పాడేవాళ్లని కలిసిన.
ఉర్దూ భాషలో అనేక వృత్తులు చేసేవాళ్లు అల్లుకున్న జానపదాలున్నయి. ఈ పాటలకు పాడే సందర్భాన్ని బట్టి లోరీనామ, చక్కీనామ, చరఖానామ లాంటి పేర్లతో సాహిత్యంలో ప్రస్తావనలున్నయి. అవి పాడేప్పుడు విన్న. వాటిని రికార్డ్ చేసుకున్న. ‘డోలక్ కీ గీత్’ ప్రచురిస్తానని చెబితే ఎంతో సంతోషమన్నరు. మూడు వందలకుపైగా పాటలు కలెక్ట్ చేసిన. పెద్ద పుస్తకం సిద్ధం చేసి, ఎంఫిల్ సబ్మిట్ చేసిన. ‘ఇది పరిశోధనా?!’ అని యూనివర్సిటీ పక్కన పడేస్తే.. ‘ఇది చాలా గొప్ప పని. దీనిని ఎట్ల రిజెక్ట్ చేస్తరు? తెలుగులో జానపద సాహిత్యానికి ఎంతో ఆదరణ ఉంది. ఉర్దూలోని జానపద సాహిత్యాన్ని ఎందుకు పట్టించుకోరు? రేపటికి ఇది చాలా అవసరం’ అని నసీముద్దీన్ గారు గట్టిగ అడిగిండు. అప్పుడు నా పరిశోధనకు ఆమోదం పడ్డది. రికమెండేషన్ వల్ల నా పనికి ఆమోదం పడ్డది. కాబట్టి ఎంఫిల్ సర్టిఫికెట్ వచ్చినా సంతోషమనిపించలె.
ఉర్దూ మహిళా రచయితల వేదిక మెహిఫిలే కవాతీన్ తంజిమ్‌తో కలిసి యూనివర్సిటీలో సెమినార్ ఉండె. అమీనా తెహజీబ్ మేడం డోలక్ కీ గీత్ పాడాలని, ఒక టీమ్‌ని తయారు చేసుకోమని చెప్పింది. ఆమే కొన్ని ఫోన్ నంబర్లు ఇచ్చింది. నేను ఫోన్ చేసి రమ్మంటే మొదట రామన్నరు. వాళ్లు పెండ్లిళ్లలో పాడతారు. అందుకే ముందు ఒప్పుకోలె. ‘మేం పెండ్లిళ్ల్లలోనే పాడతాం’ అన్నరు. ఇక్కడ పాడితే అవకాశాలు పెరుగుతయని చెప్పిన. వాళ్లు కొన్ని తప్పులు పాడేది. వాటిని కరెక్ట్ చేసిన. అట్లనె ఒకటీ రెండు పాటలు పాడి ఆ తర్వాత సినిమా పాటలు పాడేటోళ్లు. ఒకప్పుడు మన పాటలు బజార్, చాందినీ సినిమాల్లో ఉన్నయ్.
డోలక్ కీ గీత్‌లో సినిమా పాటలొద్దంటే.. మాకు వేరే పాటలు రావన్నరు. హఫీజా టీమ్‌కి కొన్ని పాటలు నేర్పించిన. వాళ్లు పాడే పాటల్లో తప్పులు సరిచేసిన. ఆ సెమినార్లో పాడిన పాట యూట్యూబ్‌లో వచ్చింది. ఒకప్పుడు హఫీజా టీమ్ ఒక్కటే ఉండేది. వాళ్లని చూసి సొంతంగా కొంతమంది డోలక్ కీ గీత్ పాడుతున్నరు. వాళ్లు ఇండియాలోనే కాదు అమెరికా, సౌదీ అరేబియా పోయి పాడొచ్చినరు. అట్ల డోలక్ కీ గీత్కి ఆదరణ పెరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో దక్కనీ భాష పరిణామం గురించి పీహెచ్డీ చేసిన. డాక్టరేట్ వచ్చింది. ఇలా నా జీవితం అనుకోకుండా పాట చుట్టూ తిరుగుతున్నది. పాటే ప్రాణమై సాగుతున్నది.
ఇన్నేండ్లూ పిల్లల భారమంతా నాపై పడింది. ఉర్దూ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు నాలుగు సార్లు ఇంటర్వ్యూకి పోయిన కానీ రాలె. అక్కడే కంప్యూటర్ ఆపరేటర్‌గా పదకొండేండ్లు పనిచేసిన. ఉస్మానియా యూనివర్సిటీ, ఉమెన్స్ కాలేజ్ (కోఠి)లో అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్ట్)గా ఉద్యోగం వచ్చింది. నాలుగేండ్ల నుంచి అక్కడ పనిచేస్తున్న. క్లాసులు ఉంటేనే జీతం. నెలకు 20 వేల నుంచి పాతికవేల రూపాయల సంపాదన. జీవితంలో ప్రేమను కోల్పోయా. ఉద్యోగంలో భద్రత లేదు. ఆర్థికంగా ఎదిగిందీ లేదు. చేతికొచ్చిన ముగ్గురు పిల్లలు, డోలక్ కీ గీత్కి మళ్లీ వైభవం తెచ్చాననే సంతృప్తి తప్ప నాకంటూ మిగుల్చుకున్నదేమీ లేదు.
– నాగవర్ధన్ రాయల
– సి.ఎం. ప్రవీణ్