కౌగిలింత.. మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతల్ని పెంచుతుంది. ఒత్తిడిని, రక్తపోటును తగ్గిస్తుంది. బాధలో, ఒంటరితనంలో ఉన్నప్పుడు.. కొండంత ఓదార్పును అందిస్తుంది. అనేక శారీరక, మానసిక అనారోగ్యాలకు.. ‘హగ్’ ఓ మందుగా పనిచేస్తుంది. ఇప్పుడు అదే హగ్.. చైనాలో ఓ వ్యాపారంగా మారింది. ఒత్తిడితో చిత్తవుతున్న అక్కడి యువతకు.. ‘హగ్ థెరపీ’ వరంలా మారింది. ఈ క్రమంలోనే ‘మ్యాన్ మమ్స్’ అంటూ.. సరికొత్త ట్రెండ్ మొదలైంది.
చైనాలో ఒంటరి మహిళలు పెరుగుతున్నారు. ఒక అంచనా ప్రకారం.. 15 ఏళ్లు దాటినవారిలో దాదాపు 20 కోట్ల మంది ఆ దేశంలో ఒంటరిగా కాలం గడుపుతున్నారు. వీరిలో ఎక్కువశాతం యువతులే ఉన్నారు. వివాహం ఆలస్యం కావడం, అసలు పెళ్లే వద్దని నిర్ణయించుకోవడంతో.. సింగిల్‌గానే ఉండిపోతున్నారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అనుభవిస్తున్నా.. ఎప్పుడో ఒకప్పుడు ఒంటరితనాన్ని ఫీలవుతున్నారట. రోజంతా పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత.. మనసారా మాట్లాడుకునేందుకు తోడులేక చింతిస్తున్నారట. కష్టసుఖాలను పంచుకోవడానికి నా అన్నవారు లేరని బాధపడుతున్నారట. దాంతో మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారట. అలా ఒత్తిడితో చిత్తయిన ఓ విద్యార్థిని.. ఈ ‘హగ్ థెరపీ’ని తెరపైకి తీసుకొచ్చింది. బాధలో ఉన్నప్పుడు ఒకరిని హగ్ చేసుకోవడం వల్ల ఒత్తిడి దూరమైందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హగ్ చేసుకోవడానికి ఆ వ్యక్తికి తాను డబ్బులు కూడా చెల్లించినట్టు చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో.. ‘హగ్ థెరపీ’ ట్రెండ్ మొదలైంది.
‘హగ్ థెరపీ’లో భాగంగా ఓ ఐదు నిమిషాలు ఎవరినైనా కౌగిలించుకుంటే.. ఒత్తిడి చిత్తవుతుందని మానసిక నిపుణులూ అంటున్నారు. దాంతో, చాలామంది మహిళలు.. ‘మ్యాన్-మమ్స్’ అంటూ పిలుచుకునే పురుషులను ఆశ్రయిస్తున్నారు. ఐదు నిమిషాల కౌగిలింతకు వారికి 50 యువాన్లు (రూ.600) వరకూ చెల్లిస్తున్నారు. నిత్య జీవితంలో ఎదురవుతున్న పని ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఈ సరికొత్త ట్రెండ్‌తో అమ్మాయిలు-అబ్బాయిలు ఇద్దరూ లాభపడుతున్నారు. అమ్మాయిలు ఒత్తిడిని, ఒంటరితనాన్ని దూరం చేసుకుంటుండగా.. అబ్బాయిలేమో జేబులు నింపుకొంటున్నారు. ప్రస్తుతం చైనాలో ఈ ట్రెండ్ బాగా పాపులర్ అవుతున్నది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. జిమ్‌కు వెళ్తూ, బలంగా కనిపించే పురుషులను ‘మ్యాన్-మమ్’ అని పిలిచేవారట. అయితే.. ఇప్పుడు ఈ పదానికి అర్థమే మారిపోయింది. తల్లిలాంటి ఓర్పు, సున్నితమైన మనసు కలిగినవాళ్లను ‘మ్యాన్-మమ్’ అని పిలుస్తున్నారు. ఓర్పు, ఎత్తు, రూపాన్ని బట్టి.. మ్యాన్-మమ్స్ను ఎంచుకుంటున్నారు చైనా యువతులు. ఎక్కువగా బహిరంగ ప్రదేశాల్లోనే వీళ్లు హగ్ చేసుకుంటారు. అంతేకాకుండా.. ఈ ‘మ్యాన్-మమ్స్’ కూడా మహిళలను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. ఐదు నిమిషాలపాటు హగ్ చేసుకొని వెళ్లిపోతారు.