వల్లీ అరుణాచలం.. న్యూక్లియర్ సైంటిస్ట్. పరమాణుశాస్త్రంలో దిట్ట. కార్పొరేట్ రాజకీయాలు మాత్రం ఆమెకు మింగుడుపడటం లేదు. పురుషాధిక్య ప్రపంచం గురించి ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్నది. ఆ సవాళ్లను అధిగమించడానికి సిద్ధంగా ఉన్నారు వల్లి. తను మురుగప్ప గ్రూప్‌లో ఒకానొక వారసురాలు. ఆమె తండ్రి రెండు దశాబ్దాలపాటు ఆ వ్యాపార పరివారాన్ని నడిపించారు.
ఆయన మరణం తర్వాత వల్లికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో చోటు కల్పించలేదు. ఆ వివక్ష వల్ల్లీ అరుణాచలంను ఆగ్రహానికి గురిచేసింది. ఆడపిల్ల అయిన కారణంగానే వ్యాపార వ్యవహారాల్లో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ.. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన బాబాయిలు, వాళ్ల మగ సంతానం మీద నిప్పులు కురిపిస్తున్నారు. ‘ఆస్తులు, ఐశ్వర్యాల కోసం కాదు నా పోరాటం. మహిళగా నా స్థానం నాకివ్వండి. ఒక తల్లిని, చెల్లిని గౌరవించే పద్ధతి ఇదేనా? మా నాన్న విలువలతో కూడిన వ్యాపారానికి ప్రాధాన్యం ఇచ్చారు. వీళ్లేమో.. విలువలకు విలువలేకుండా చేస్తున్నారు’ అని వాపోతారామె. తన వయసు అరవై రెండు.