అన్ని వయసుల వారికి గుడ్డును ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు. ప్రొటీన్లు పుష్కలంగా ఉండే గుడ్లలో విటమిన్లు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా సమృద్ధిగానే ఉంటాయి. అయితే, రోజుకు ఎన్ని గుడ్లు తినొచ్చు అనే విషయంలో చాలామందికి సందేహాలు ఉంటాయి. వయసు, బరువు, లింగం, శారీరక శ్రమ తదితర అంశాల మీద ఇది ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎన్ని తినాలనే దానిమీద ఇప్పటి వరకైతే ఎలాంటి పరిమితులూ లేవు.
గుండెజబ్బుల ముప్పు ఉన్నవాళ్లు పచ్చసొన విడిచిపెట్టి తెల్లసొన మాత్రమే తినాలి. గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, అధిక ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయులు ఉన్నవాళ్లు మాత్రం వారానికి ఏడు (అంటే రోజుకు ఒకటి చొప్పున) గుడ్లు తినొచ్చు.
ఓ మోస్తరు గుడ్డు 5 గ్రాముల ఆరోగ్యకరమైన అన్‌శాచురేటెడ్ ఫ్యాట్, 6 గ్రాముల నాణ్యమైన ప్రొటీన్, విటమిన్ డి, విటమిన్ బి, 186 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్‌తోపాటు మెదడు పనితీరును మెరుగుపరిచే ముఖ్యమైన పదార్థం కోలిన్‌ను కలిగి ఉంటుంది. ఇక గుడ్డు పచ్చసొన విటమిన్లు, మినరల్స్, ఆరోగ్యకరమైన కొవ్వులకు గని.
ఇక రోజుకు ఎన్ని గుడ్లు తినాలనేది మీ ఆరోగ్యం, ఆహార అవసరాల మీద ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యవంతులు రోజుకు 1 – 3 గుడ్లు తినొచ్చు. చురుకైన జీవనశైలి కలిగిన వాళ్లు, అథ్లెట్లు 2 – 4 గుడ్ల వరకు లాగించవచ్చు.
ఇక స్త్రీలైతే రోజుకు 1 నుంచి 2 గుడ్లు తినడం మంచిది. గర్భధారణ సమయం, మెనోపాజ్ దశలో ఉన్నవాళ్ల ఎముకల ఆరోగ్యానికి గుడ్డులో ఉండే విటమిన్ డి సహాయకారిగా ఉంటుంది. పచ్చసొన తింటే ఐరన్, ఫోలేట్ లభిస్తాయి.
వారానికి ఏడు గుడ్లు తినడం మంచిది. కాకపోతే, టైప్ 2 డయాబెటిస్, అధిక హెచ్‌డీఎల్ (చెడు) కొలెస్ట్రాల్, గుండెజబ్బులు ఉన్నవాళ్లు మాత్రం గుడ్డు తెల్లసొననే తీసుకోవాలి. మెటబాలిక్ సిండ్రోమ్స్ ఉన్నవాళ్లయితే వారానికి 6 గుడ్ల వరకు తీసుకోవచ్చు. ఎంత ఆరోగ్యకరమైనా సరే గుడ్లను తాజా పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్, లీన్ (తేలికపాటి) ప్రొటీన్లతో కలిపి తీసుకోవాలి. అంతేతప్ప మంచివని చెప్పి ఒక్క గుడ్ల మీదే ఆధారపడకూడదు. మితం తప్పితే అమృతమైనా విషమే అనే విషయం తెలిసిందే కదా!