ఫ్రిజ్లో పెట్టిన ఆహారం ఎంత వరకూ మంచిది. చల్లదనం వల్ల ఆహార పదార్థాల జీవితకాలం పెరుగుతుంది అంటారు కదా! కూర, పప్పులాంటివి కూడా ఫ్రిజ్లో పెట్టుకుని మరుసటి రోజు తినొచ్చా?
-ఓ పాఠకురాలు
Thawing | ఫ్రిజ్లో పెట్టడం వల్ల ఆహార పదార్థాల జీవితకాలం పెరుగుతుందన్నమాట నిజమే. అయితే రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసేందుకు, వాటిని తీసి మళ్లీ తినేందుకు కొన్ని ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా, ఫ్రిజ్లో పెట్టిన ఏ పదార్థాన్ని అయినా బయటికి తీశాక.. గది ఉష్ణోగ్రతకు వచ్చేదాకా ఉంచి.. ఆ తర్వాతే వినియోగించాలి. దీన్ని ఇంగ్లిష్లో ‘తావింగ్’ అంటాం. పప్పు, కూరల్లాంటి వండిన పదార్థాలను నిల్వ చేయాలి అనుకుంటే.. వండిన రెండు గంటల్లోపే ఫ్రిజ్లో పెట్టుకోవాలి. అలా అయితేనే దాదాపు 48 గంటల వరకూ పాడవకుండా ఉంటాయి. రెండు గంటల తర్వాత నుంచీ వండిన పదార్థాల్లో బ్యాక్టీరియా పెరుగుదల మొదలవుతుంది. అదే వండని మాంసాన్ని నిలువ చేయాలంటే మాత్రం డీప్ఫ్రిజ్ ఉపయోగించాలి.
అందులో ఉంచి ఫ్రీజర్ ఆన్ చేస్తే మాంసం రెండు రోజుల దాకా నిలువ ఉంటుంది. పండ్లూ, కూరగాయల్లాంటివి వారం నుంచి పది రోజుల దాకా పాడవకుండా ఉంటాయి. ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) ప్రకారం ఉడికించిన ఏ పదార్థాన్ని అయినా.. ఎలాంటి వాతావరణంలో నిల్వ చేసినా.. గరిష్ఠంగా వారం రోజుల వరకు మాత్రమే తినాలి. అలాగే స్ట్రాబెర్రీలు, ములక్కాడలాంటి వాటిని గడ్డ కట్టించి మూడు, నాలుగు నెలలకుపైగా నిలువ ఉంచుతారు. అయితే అప్పటికప్పుడు తినే ఆహార పదార్థాలతో పోలిస్తే రోజుల తరబడి నిల్వ ఉంచిన వాటిలోని పోషక విలువలు సన్నగిల్లుతాయి. ఆస్తమా, సైనసైటిస్, శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవారు మాత్రం ఆరోగ్య కారణాల రీత్యా నిలువ ఆహారానికి దూరంగా ఉండాలి. తాజా పదార్థాలను మాత్రమే తినడం మంచిది.
మయూరి ఆవుల , న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com