మండే ఎండకాలం మొదలైంది. వేడి వాతావరణంలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి చాలామంది కూల్ డ్రింక్స్‌ను ఆశ్రయిస్తుంటారు. రసాయనాలు, ప్రిజర్వేటివ్స్, గ్యాస్ కలిసిన వీటిని తాగితే.. ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి, ఈ సమ్మర్లో వాటి జోలికి వెళ్లకుండా.. ఇంట్లో లభించే పదార్థాలతోనే ఆరోగ్యకరమైన పానీయాలు చేసుకోండి. ఇవి.. ఎండల నుంచి రక్షణను ఇవ్వడమే కాదు, ఆరోగ్యానికి మంచి చేస్తాయి. ఒంట్లో వేడిని తగ్గించి.. శరీరానికి కొత్త శక్తిని అందిస్తాయి.
వేసవి వేడితో అలసటకు గురయ్యే వారికి.. పైనాపిల్ – నిమ్మరసం డ్రింక్ ఎంతో మేలుచేస్తుంది. నాలుగు నుంచి ఐదు పైనాపిల్ ముక్కలను నిమ్మరసంతో కలిపి బ్లెండ్ చేసుకోవాలి. దీనికి కొద్దిగా చల్లని నీటిని జోడించి తాగితే.. శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. తీపి కోసం కొద్దిగా తేనెను కలుపుకోవచ్చు.
లీటర్ నీటిలో ఒక నిమ్మకాయను పూర్తిగా పిండండి. అంగుళం అల్లం ముక్క, పుదీనా ఆకులను మెత్తగా దంచి నీటిలో బాగా కలపండి. ఈ మిశ్రమానికి చిటికెడు నల్ల మిరియాల పొడి కలిపి తాగితే.. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. నానబెట్టిన చియా విత్తనాలను కూడా జోడిస్తే.. ఒంటికి చలువ చేస్తుంది.
ఒక లీటర్ నీటిని తీసుకొని.. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, నాలుగైదు పుదీనా ఆకులు వేయాలి. దీనికి కొద్దిగా ఉప్పు, తేనె జోడించి తాగితే.. శరీరానికి తక్షణ చల్లదనం లభిస్తుంది. చల్లచల్లగా తాగాలనుకుంటే.. ఐస్ క్యూబ్స్‌తో కలిపి కూడా తాగవచ్చు. నిమ్మకాయలో లభించే విటమిన్ సి శరీరాన్ని హైడ్రేట్ చేయడంతోపాటు పుదీనా ఆకులు జీర్ణ వ్యవస్థకు మేలుచేస్తాయి.
లీటర్ నీటిలో రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి.. స్టవ్ మీదపెట్టి బాగా మరగనివ్వండి. ఆ తర్వాత నీటిని వడగట్టి.. అందులో ఒక నిమ్మకాయ రసాన్ని పిండి.. కాసేపు ఫ్రిజ్‌లో పెట్టేయండి. ఈ నీటిని చల్లచల్లగా తాగితే.. ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. దీనికి దాల్చినచెక్క పొడి, తేనె కలిపితే మరిన్ని ప్రయోజనాలు అందుతాయి. ఈ డ్రింక్.. శరీరంలో వేడిని తగ్గించడంతోపాటు జీర్ణక్రియనూ మెరుగుపరుస్తుంది.