Private Jobs | కార్పొరేట్ ప్రపంచమే. అన్నీ ప్రైవేట్ ఉద్యోగాలే. కాబట్టి, కార్పొరేట్ పరుగు ఇప్పుడిప్పుడే మొదలుపెట్టిన వాళ్లు, ఇప్పటికే పోరాడుతున్న వాళ్లు పని ప్రదేశాల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి కొన్ని కఠోరమైన సత్యాలు తెలుసుకుని ఉండాలి.
జీవితంలో విజయం సాధించడానికి కష్టపడి పనిచేయడం ప్రధానం. కాకపోతే ఈ సూత్రం అన్నిసార్లూ విజయానికి హామీ ఇవ్వకపోవచ్చు. కెరీర్లో అభివృద్ధి చెందడానికి కష్టానికి తోడుగా ఆఫీస్లో మంచి నెట్వర్క్ ఏర్పర్చుకోవడం, తెలివిగా పనిచేయడం కూడా అవసరమవుతాయి.
కంపెనీలో మీరెంత కష్టపడి పనిచేసినా, విలువైన వ్యక్తి అయినా ఎప్పుడో ఓసారి ఉద్వాసన తప్పకపోవచ్చు. అందుకే, కష్ట సమయాలను ఎదుర్కోవడానికి అన్నివేళలా బ్యాకప్ ప్రణాళిక సిద్ధంగా ఉంచుకోవాలి.
ఉద్యోగంలో ప్రవేశించడానికి డిగ్రీ ఉపకరిస్తుంది. అయితే, కెరీర్లో దూసుకుపోయే విషయంలో మీ
నైపుణ్యాలు, తెలివితేటలే అంతిమ నిర్ణేతలు అని గుర్తుంచుకోండి.
ఆఫీసుల్లో రాజకీయాలను అన్నిసార్లూ తప్పించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి, వాటినుంచి దూరంగా పరిగెత్తే బదులు, సహోద్యోగులతో సామరస్యం కోల్పోకుండా మీకు ఎదురయ్యే ఆటంకాలను తెలివిగా అధిగమించడం నేర్చుకోవాలి.
కార్పొరేట్ ప్రపంచంలో మీకేం తెలుసు అనే దానికంటే మీకు ఎవ్వరు తెలుసు అనే అంశం చాలా ప్రధానమైంది. కాబట్టి, మీ తోటివారితో బలమైన వృత్తిగత సంబంధాలను ఏర్పర్చుకోవాలి.
ఉద్యోగం అంటే ఎంత ఉత్సాహంగా ఉన్నప్పటికీ, ఎప్పుడో ఓసారి మీ పని పట్ల ఇష్టం తగ్గిపోవచ్చు. అలాంటి సమయాల్లో మీ వృత్తిలో ముందుకు సాగడానికి క్రమశిక్షణ, స్థిరత్వం ఎంతో దోహదపడతాయి.
కొంతమంది మిమ్మల్ని కంపెనీకి అమూల్యమైన సంపదగా పేర్కొంటూ ఉండొచ్చు. అంతమాత్రాన మిమ్మల్ని వేరెవ్వరూ భర్తీ చేయలేరని అతి విశ్వాసానికి పోకూడదు. అందువల్ల అణకువగా, ఇతరులు మిమ్మల్ని అనుసరించేలా నడుచుకోవాలి. నిజాయతీగా మీ బాధ్యత నిర్వర్తించాలి. మీ విజయాలు మిమ్మల్ని అహంభావిగా మార్చకుండా జాగ్రత్తపడాలి.
కొన్నిసార్లు వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెడితేనే విజయం సిద్ధిస్తుంది. అందువల్ల పూర్తిగా పనికే అంకితం కావొద్దు. ముందుగా మీ జీవిత ప్రాథమ్యాలేంటో నిర్ణయించుకోవాలి. వృత్తితోపాటు జీవితంలోనూ విజయం సాధించాలి.
వృత్తి జీవితంలో ఒడుదొడుకులు, ఎత్తుపల్లాలు అత్యంత సహజం. కాబట్టి, మీరు అనుకున్నట్టు జరగకపోతే కుంగిపోవద్దు. బదులుగా మీ పొరపాట్ల నుంచి నేర్చుకోవాలి. పనిలో మెరుగుపడాలి. కెరీర్లో ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉండాలి.
ఉద్యోగులకు తామెంత వేతనం ఇవ్వగలమనే దాని గురించే సంస్థలు ఆలోచిస్తాయి. కాబట్టి మీకు తగిన మొత్తం గురించి యాజమాన్యంతో చర్చించాలి. మీ సామర్థ్యం గురించి మీరు విశ్వాసం కలిగించాలి.