నమస్తే. మాది పెద్దలు కుదిర్చిన పెండ్లి. నా భర్త వ్యాపారం చేస్తాడు. నేను ఇంట్లోనే ఉంటాను. ఆయనకు మా పుట్టింటి వాళ్లంటే గౌరవం లేదు. చులకనగా మాట్లాడతాడు. డబ్బు మనుషులని, తన వ్యాపారానికి సాయం చేయరనీ దుమ్మెత్తిపోస్తాడు. నిజానికి, మా వాళ్లు చాలాసార్లు డబ్బు ఇచ్చారు. ఆయనే నిలుపుకోలేకపోయాడు. దీంతో మా నాన్న తన వల్లకాదని చేతులెత్తేశారు. అప్పటినుంచీ ఆ కోపాన్ని నా మీద, పాప మీద చూపిస్తున్నాడు. నోటికొచ్చినట్టు తిడుతున్నాడు. కొడుతున్నాడు. పుట్టింటికి వెళ్లి డబ్బు తీసుకురమ్మని వేధిస్తున్నాడు. నన్నేం చేయమంటారు?
– ఓ సోదరి
కొందరంతే. పరాన్నజీవులు. కష్టపడలేరు. సంపాదించుకోలేరు. అన్నీ అయాచితంగా రావాలని అనుకుంటారు. మీ పుట్టింటివారిది కూడా మధ్య తరగతి కుటుంబమే అని తెలుస్తున్నది. ఆర్థిక అవసరాలు తీరిస్తేనే నిన్ను ప్రేమిస్తాను.. అంటూ షరతులు పెడుతున్నాడంటేనే డబ్బు మనిషి అని అర్థం అవుతున్నది. పెట్టుబడికి పైసలు లేనప్పుడు వ్యాపారం చేయడం ఎందుకు? ఉద్యోగం చూసుకోమని చెప్పండి. మీరు కూడా ఏదైనా పార్ట్‌టైమ్ జాబ్ వెతుక్కోండి. ఇద్దరి సంపాదనతో ముగ్గురు బతకడం ఏమంత కష్టం కాదు. వ్యాపారంలోని చికాకులు పిల్లల మీద చూపడమూ మంచిది కాదు. అదే సమయంలో అతని మానసిక స్థితిని కూడా అర్థం చేసుకోవాలి. తనతో ప్రేమగా ఉండండి. ధైర్యం చెప్పండి. కొత్త జీవితం ప్రారంభించడానికి మీ వంతు మద్దతు అందించండి. పుట్టింటివారి ముందు అయినా సరే, చులకన చేసి మాట్లాడకండి. త్వరలోనే సమస్యలన్నీ సర్దుకుంటాయి.