ఆహారం పద్ధతిగా తింటేనే ఒంటబడుతుందని పెద్దల మాట. బాగా నమిలి తింటే మంచిదని కూడా చెబుతుంటారు. కానీ, అంత తీరిగ్గా కూర్చొని తినే సమయం పట్నవాసులకు ఎక్కడిది? ఓటీటీకి గంటల తరబడి అతుక్కుపోయినప్పుడు కనిపించని గడియారం.. తిండి దగ్గరికి వచ్చేసరికి టక్కున గుర్తొస్తుంటుంది. పైగా చేతితో తినే అలవాటూ తప్పిపోయింది. కంచంలో ఏం వడ్డించినా స్పూన్‌తో పైపైన టచ్ చేస్తూ.. మెరుపువేగంతో తినడం రివాజుగా మారింది. ఇలా వేగంగా తినేవాళ్లను అదుపు చేయడానికి పుట్టుకొచ్చింది ఈ స్మార్ట్ ఫోర్క్. దీన్ని ఉపయోగించినప్పుడు ఎంత వేగంగా తింటున్నామో ట్రాక్ చేయొచ్చు.
నిమిషానికి ఎన్ని ముద్దలు హాంఫట్ చేశారో ఫోన్లో తెలియజేస్తుంది. మితిమీరిన వేగంతో తింటుంటే వైబ్రేట్ అవుతూ ‘నిదానమే ప్రధానం’ అని హెచ్చరిస్తుంది. ఏ పూటకాపూట ఎన్ని ముద్దలు, ఎంత వేగంగా తిన్నామో, ఎంత సమయం భోజనం చేశామో.. అన్నీ ఫోన్లో చూసుకోవచ్చు. లెక్క ఎక్కువైనా ఫర్వాలేదు టైమ్ తక్కువ కాకుండా చూసుకోమని సున్నితంగా హెచ్చరిస్తుందన్నమాట. భలేగా ఉంది కదా ఈ ఇస్మార్ట్ ఫోర్క్. ఫోర్క్స్తోపాటు స్మార్ట్ చెంచాలు లభ్యమవుతున్నాయి. ఆన్లైన్ అంగట్లో రకరకాల బ్రాండ్లకు చెందినవి అందుబాటులో ఉన్నాయి.