ఆభరణాలు ఎంచుకోవడంలో అతివల అభిరుచులే వేరు. ఒక్కొక్కరూ ఒక్కోరకాన్ని ఇష్టపడతారు. సందర్భాన్ని బట్టి నచ్చిన వాటిని అలంకరించుకుంటారు. అయితే, పెళ్లి లాంటి వేడుకల్లో మాత్రం.. సంప్రదాయ నగలకే ‘జై’ కొడతారు. అలాంటి వాటిలో ముందుండేవి.. హాత్‌ఫూల్ జువెల్లరీ! ఇవే అసలు సిసలైన హస్త భూషణాలు! ఇంతిచేతిపై కొలువుదీరే.. ఈ ఇంపైన నగల విశేషాలేంటో తెలుసుకుందాం..
Hatful Jewellery | భారతీయ వివాహ వేడుకల్లో హాత్‌ఫూల్ నగలది ప్రత్యేక స్థానం. వధువు వస్త్రధారణలో ముఖ్యమైన ఆభరణం. ఇవి మహిళల సౌందర్యానికి, శుభానికి, వైవాహిక బంధానికి ప్రతీకలుగా నిలుస్తాయి. వివాహాలతోపాటు, పండుగలు, సాంస్కృతిక వేడుకల్లోనూ చెలియల చేతులపై సందడి చేస్తాయి. బంగారం, వెండిలాంటి ఖరీదైన లోహాలకు వజ్రాలు, రూబీలు, ఎమరాల్డ్, ముత్యాల లాంటి విలువైన రత్నాలు జతకూడి.. ఈ హాత్‌ఫూల్ ఆభరణాలు తయారవుతున్నాయి. క్లిష్టమైన ఫిలిగ్రీలాంటి సంప్రదాయ డిజైన్ల నుంచి, మినిమలిస్ట్, ఎనామెల్ లాంటి ఆధునిక డిజైన్ల వరకూ.. ఈ నగల్లో ఒదిగి పోతున్నాయి.
కొన్ని డిజైన్లలో పూల నమూనాలు, రేఖాగణిత ఆకారాలు, నెమళ్లు, ఏనుగులు, హంసల వంటి ఆకృతులూ కొలువు దీరుతున్నాయి. సాంస్కృతిక ప్రాముఖ్యతనూ పెంచుతున్నాయి. వీటి తయారీలో ఉపయోగించే ఆకారాలు, రాళ్లు, డిజైన్లను బట్టి.. ఈ నగల్లో చాలారకాలు ఉంటాయి. కుందన్లను పొదిగిన వాటిని ‘కుందన్ హాత్‌ఫూల్’ అంటారు. వీటిని బంగారం లేదా వెండితో చేస్తారు. రంగురంగుల రత్నాలు, ముత్యాలను ఉపయోగించి జాడవ్ పద్ధతిలో వీటిని తయారుచేస్తారు.
లోహాలపై ఎనామెల్ మెరుపులను జోడించేది.. మీనాకారీ హాత్పూల్. ఆకర్షణీయమైన రంగుల్లో రకరకాల ఆకృతులను పొదిగిన ఈ నగలు.. హస్తకళకు తార్కాణంగా నిలుస్తాయి. అన్నిరకాల దుస్తులకూ సంప్రదాయ కళను తీసుకొస్తాయి. ముత్యాలను జోడించి చేస్తే.. ‘పెర్ల్ హాత్‌ఫూల్’. వీటిని స్వచ్ఛత, దయకు చిహ్నంగా భావిస్తారు. కట్ డైమండ్స్‌ను పొదిగిన డిజైన్లను.. ‘పోల్కీ హాత్‌ఫూల్’ అంటారు. ఇవి మిలమిల మెరుస్తూ.. అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి.
ఇక గులాబీలు, చామంతుల వంటి పూల డిజైన్లతో కనిపించేవి ‘ఫ్లోరల్ హాత్‌ఫూల్’. ఈరకం డిజైన్లు లోహాలతోనే కాకుండా.. నిజమైన పూలు, ప్లాస్టిక్ పూలతోనూ రూపుదిద్దుకుంటున్నాయి. ధరించే దుస్తులను బట్టి.. వాటికి నప్పేలా రంగులను ఎంచుకోవచ్చు. ఇవేకాకుండా.. సిల్వర్ హాత్‌ఫూల్, క్రిస్టల్ హాత్‌ఫూల్, గోల్డ్ హాత్‌ఫూల్, రాజస్థానీ హాత్‌ఫూల్, వింటేజ్ హాత్‌ఫూల్, ట్రైబల్ హాత్‌ఫూల్.. ఇలా దీని లిస్టు చాంతాడంత! మగువల మనసుకు నచ్చినట్టుగా ఎంచుకోవచ్చు! మరెందుకు ఆలస్యం.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి!