అందంగా కనిపించాలంటే చర్మ ఆరోగ్యంతోపాటు, ముఖాకృతీ ముఖ్యమే. అయితే వయసు పెరిగేకొద్దీ రకరకాల కారణాల వల్ల అది మార్పులకు లోనవుతుంటుంది. గీతలు, ముడతలు పడుతుంటాయి. వాటి నుంచి ఉపశమనం పొందడంతోపాటు, చక్కని ముఖాకృతి కోసం అంటూ ఇటీవల బ్యూటీ బజార్లో ఓ కొత్త సౌందర్య సాధనం హల్చల్ చేస్తున్నది. అదే ‘గ్వాషా స్టోన్’. హృదయాకారంలో ఉండే ఉపరత్నాల జాతికి చెందిన రాయి ఇది. జేడ్, క్వార్ట్, అమెథిస్ట్ లాంటి రాళ్లు వీటిలో ఉంటాయి. ఈ తరహా రాళ్లకు కొన్ని రుగ్మతల నుంచి స్వస్థపరిచే గుణం ఉంటుందని నమ్ముతారు. చైనా సంప్రదాయ వైద్య విధానంలో ఈ రాయి భాగంగా ఉండేది. బిగుసుకుపోయిన కండరాలను రిలాక్స్ చేసేందుకు, నొప్పుల్ని తగ్గించేందుకు దీన్ని వాడేవారు. ఆ కాలం నుంచే ఇది సౌందర్య సాధనంగానూ ఉంది.
హృదయాకారంలో ఉండే ఈ రాయిని ముఖం, మెడ ప్రాంతాలను మసాజ్ చేసేందుకు వాడుతున్నారు. ముక్కు, చెంపలు, దవడ, నుదురులాంటి చోట్ల ప్రత్యేక పద్ధతుల్లో దీనితో మర్దనా చేస్తారు. వివిధ కోణాల్లో ఉపయోగించేలా దీని ఆకృతి ఉంటుంది. ఇలా మర్దనా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. ముడతలు తగ్గి చర్మం కాంతిమంతంగా, బిగుతుగా తయారవుతుందట. కళ్లకింద వలయాలు, ఉబ్బినట్టు కనిపించడంలాంటి వాటి మీదా ప్రభావం చూపుతుంది. మొత్తంగా సరికొత్త యాంటీ ఏజెనింగ్ టూల్గా గ్వాషా మారిందన్న మాట. దీన్ని ఎలా వాడాలన్న దానిమీదా యూట్యూబ్లో వీడియోలు చాలానే ఉన్నాయి. వాటినే ఇప్పుడు అమ్మాయిలు తెగ వెతికేస్తున్నారట.