ఇంట్లో మొక్కలు పెంచుకుంటే అందంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే వాటికి నీళ్లు పట్టడం ఓ పని. ఆ పట్టిన నీళ్లు కుండీల నుంచి మట్టితో కిందికి జారి ఫ్లోర్ పాడుచేస్తాయి. అయితే నీళ్లు ఎక్కువగా అవసరం లేని మొక్కలను పెంచుకుంటే ఈ సమస్య ఉండదు. ఈ మొక్కలు అలాంటివే.. వీటిని బాల్కనీలో పెంచుకోవచ్చు, హాల్లో కూడా అలంకరించుకోవచ్చు.
బోగన్‌విల్లియా
దీనినే కాగితం పూల చెట్టు అని కూడా అంటారు. ఇది గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చాలా విస్తారంగా పెరుగుతుంది. కుండీల్లో పెంచుకోదగిన రకాలూ దొరుకుతున్నాయి. అంతేకాదు తెలుపు, ఎరుపు, నారింజ, గోధుమ రంగుల్లో పూసే మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మొక్కకు నీటి అవసరం ఎక్కువగా ఉండదు. పాదుని కాస్త తడిపితే చాలు.. చాలాకాలం వరకు తాజాగా ఉండి నిండుగా పుష్పించి అలరిస్తుంది.
రబ్బర్ ప్లాంట్
ఈ మొక్కకు ఒక్కసారి నీళ్లు పడితే చాలు నెలంతా తాజా ఆకులతో వికసిస్తూ ఆహ్లాదాన్ని పంచుతుంది. దళసరి ఆకులతో ఆకట్టుకునే ఈ మొక్క హాల్‌కు కొత్త అందాన్ని తెచ్చి పెడుతుంది.
మనీ ప్లాంట్
ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవని, సంపద పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. అందుకే దీన్ని పెంచుకునేందుకు ఆసక్తి చూపుతారు. దీనికి కూడా అంతగా నీటి అవసరం ఉండదు.
ఇవేకాదు కాక్టస్, జేడ్, స్నేక్ ప్లాంట్ లాంటి మొక్కలకు కూడా నీటి అవసరం అంతగా ఉండదు. ఇంకేం ఈ మొక్కలకు ఇంట్లో చోటిచ్చి.. మీ గృహాన్ని వనసీమగా మార్చేసుకోండి.