గదుల్లో మొక్కల్ని పెంచుకోవడం ఇప్పుడు ఇంటి అలంకరణలో భాగమైంది. అక్కడ పెట్టే మొక్కలను ఎంత ప్రత్యేకంగా ఎంచుకుంటున్నారో, వాటిని ఉంచే కుండీలూ అంతే వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటున్నారు. అందులోనూ పచ్చదనాన్ని ఇష్టపడే వారంతా పర్యావరణానికి హాని చేయని వస్తువులనే వాడాలని కోరుకుంటున్నారు. అందుకే ఈ మొక్కలు పెంచే కుండీలూ విభిన్నంగా, ఎకో ఫ్రెండ్లీగా రూపొందుతున్నాయి.
‘గ్రాస్ వీవింగ్ ప్లాంటర్ల’ పేరిట దొరుకుతున్న వీటిని సబాయ్ గ్రాస్లాంటి విభిన్న రకాల గడ్డిని ఉపయోగించి అల్లుతున్నారు. చిన్నా పెద్దా సైజుల్లో, రకరకాల ఆకృతుల్లో వీటిని రూపొందిస్తున్నారు. సహజ సిద్ధమైన రంగులనే వినియోగించి చేస్తున్న వీటికి ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది! ఆన్లైన్ అంగట్లో సరసమైన ధరల్లో అందుబాటులో ఉన్నాయి.