సంక్రాంతి వచ్చిందంటే వాకిట్లో ముగ్గులు, వంటింట్లో పిండివంటలు ఉండాల్సిందే! కరకరలాడే మురుకులు, బురబురలాడే సకినాలు… అచ్చ తెలంగాణ పిండి వంటలను 18 ఏండ్లుగా వండి వడ్డిస్తున్నారు కరీంనగర్‌కు చెందిన గోనె సుహాసిని. ఆహార ప్రియులకు చక్కటి రుచిని అందిస్తూనే, పాతికమంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్న శ్రీలక్ష్మి తెలంగాణ పిండివంటల నిర్వాహకురాలు సుహాసిని సంక్రాంతి మూకుడు ముచ్చట్లు ఆమె మాటల్లోనే..
మాది జగిత్యాల జిల్లా భీర్పూర్ గ్రామం. పదో తరగతి వరకు చదువుకున్న నేను పెళ్లి చేసుకొని గృహిణిగా స్థిరపడ్డాను. అనుకోకుండా కుటుంబమంతా హైదరాబాద్‌కు షిప్ట్ అయింది. కొత్త ప్రాంతం కావడంతో ఇంట్లోనే ఉండేదాన్ని. ఏదైనా పనిచేస్తే బాగుంటుందని భావించి అప్పాలు చేయాలని నిర్ణయించుకున్నా. మావారికి చెబితే ఓకే అనడంతో నా ప్రయాణాన్ని మొదలు పెట్టిన. నల్లకుంటలోని తిలక్‌నగర్‌లో ఉంటూ అక్కడే పిండివంటలు చేసేదాన్ని. మొదట్లో మా అక్క, వదిన, నేను తయారు చేసేవాళ్లం. తెలిసిన వాళ్లకు పంపించేవాళ్లం. కొన్నాళ్లకు చిన్నగా ఆర్డర్లు రావడం ప్రారంభమైంది. తర్వాత శుభకార్యాలు, పండుగలకు పిండివంటలు సరఫరా చేయడం మొదలైంది.

మరిన్ని బ్రాంచ్‌లకు
తెలంగాణ పిండివంటలను అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన నా ప్రస్థానం ఇంటి నుంచి కార్ఖానాకు మారింది. చిన్నపాటి ఫ్యాక్టరీ ఒకటి పెట్టుకొని అందులో 25మందికి ఉపాధి కల్పిస్తున్నాను. రకరకాల గారెలు, మురుకులు, తెల్ల సకినాలు, కారం సకినాలు, పల్లి గారెలు, శెనగపప్పు గారెలు, పచ్చిమిర్చి-పల్లి గారెలు, చెగోడీలు, మిక్చర్, బూందీ, అటుకులు లాంటి హాట్తోపాటు మిఠాయిలు కూడా తయారు చేస్తున్నాం. విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. నా శ్రమలో నా భర్త, కుటుంబం ప్రోత్సాహం వెలకట్టలేనిది. భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్‌లు నెలకొల్పాలనీ, తద్వారా మరింత మందికి ఉపాధి కల్పించాలని
కోరుకుంటున్నా!
– వర్కాల కృష్ణ
– గడసంతల శ్రీనివాస్