తల్లిదండ్రులతో కలిసి చేసే ప్రయాణాలు సరదాగా సాగవని యువతలో ఓ అపోహ ఉన్నది. ఆ అపోహలను జెన్-జెడ్ తరం చెరిపేస్తున్నది. పేరెంట్స్‌తో కలిసి టూర్స్ వేస్తూ.. నచ్చిన ప్రదేశాన్ని చుట్టివస్తున్నది. వారాంతపు విహారయాత్ర అయినా, ఖండాంతర ప్రయాణమైనా.. తల్లిదండ్రులతో కలిసే ప్రయాణిస్తున్నది. ‘ఇలాంటి టూర్స్ కేవలం కొత్త ప్రదేశాలను సందర్శించడం మాత్రమే కాదు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం. బంధాలను తిరిగి నిలుపుకోవడం’ అని చాటిచెబుతున్నది.
బాల్యంలో ప్రయాణాలంటేనే.. తల్లిదండ్రులతోనే కలిసి వెళ్లేవారు. స్కూల్‌కు సెలవులు వచ్చాయంటే.. బంధువుల ఇళ్లకు ప్రయాణం కట్టేవారు. లేకుంటే.. పుణ్యక్షేత్రాలు చుట్టి వచ్చేవారు. మరిప్పుడో.. ఒంటరిగానో, జీవిత భాగస్వామితోనో విహారయాత్రలకు వెళ్తున్నారు. నిన్నమొన్నటి దాకా చాలామంది ఇలాంటి యాత్రలే చేశారు. ఇప్పటి యువతీ యువకులు తల్లిదండ్రులతో కలిసి ప్రయాణాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా, ఉమ్మడి కుటుంబానికి పెద్దపీట వేస్తూ.. విహారయాత్రలు చేస్తున్నారు. బంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నారు. మిలీనియల్స్తోపాటు జెన్-జెడ్ తరాలు.. ఇలాంటి ప్రయాణ ప్రణాళికలను చురుగ్గా ఆచరిస్తున్నారు.
కుటుంబంగా కలిసి సమయం గడపడంలో ఎంతో ఆనందం ఉంటుందని యువత చెబుతున్నది. జెన్-జెడ్ పిల్లల తల్లిదండ్రుల్లో చాలామంది ఆధునిక భావాలనే కలిగి ఉంటున్నారు. కాబట్టి, వారుకూడా పిల్లలతో కలిసి విహార యాత్రలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కేవలం పేరెంట్స్‌గానే కాదు.. పిల్లలతో స్నేహితులుగా కలిసిపోతున్నారు. ఇటు పిల్లలు కూడా.. పేరెంట్స్‌తో జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు. కలిసి తిరుగుతూ.. కొత్తకొత్త ప్రాంతాలను ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. స్థానిక సాంస్కృతిక కార్యక్రమాలు మొదలుకొని.. వీకెండ్ పార్టీల వరకూ అన్నిట్లోనూ కలిసి పాల్గొంటున్నారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటూ.. చిరస్మరణీయమైన అనుభవాలను మూటగట్టుకుంటున్నారు.
పేరెంట్స్‌లో ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లే ఉంటారు. కాబట్టి, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వైద్యుల గ్రీన్‌సిగ్నల్ పొందడం మొదలుకొని.. పర్వతప్రాంతాల్లో విహరించడానికి అనుమతులు తీసుకోవడం వరకూ ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉంటున్నారు. ఇక యాత్రలు కూడా వారి సౌలభ్యం చుట్టూనే కేంద్రీకృతమయ్యేలా చూసుకుంటున్నారు. ఇందుకోసం ట్రైన్ టికెట్స్ నుంచి హోటల్స్ రూమ్స్ వరకూ ప్రతీది ముందుగానే రిజర్వ్ చేసుకుంటున్నారు. యాత్రల్లో భాగంగా అందరికీ నచ్చే గమ్యస్థానాలనే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. తల్లిదండ్రుల శారీరక సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకొని.. భద్రత, ఆహారం, ప్రయాణ సౌకర్యానికి పెద్దపీట వేస్తున్నారు.