మాతృ దినోత్సవం నాడు అమ్మకు ఉట్టి శుభాకాంక్షలే కాదు, గట్టి బహుమతినీ అందించాలని కోరుకుంటాం. అయితే అమ్మ కోసం ఏం సెలెక్ట్ చేయాలి అన్నది అతిపెద్ద ప్రశ్నలా మారుతుంది. ఈ విషయంలో కాస్త మనసుపెడితే అమ్మ మనసు గెలుచుకోవడం సులభమే. స్పా జార్, పర్ఫ్యూమ్ బాస్కెట్, గార్డెన్ సెట్… ఇలా అభిరుచిని బట్టి కానుకను ఎంచి, మనమే దాన్ని భిన్నంగా తయారుచేసి ఇచ్చామంటే, అమ్మ ముఖంలో ఆనందం చూసి ఆ రోజు నిజంగా పండగే అనిపిస్తుంది. మీరూ ప్రయత్నిస్తారా మరి!
‘అమ్మా… యు ఆర్ సో బ్యూటిఫుల్!! ఏం చేశావ్ మ్యాజిక్…’ అని ఏ ఫేషియల్ చేసుకున్న రోజో, ఫేస్‌ప్యాక్ పెట్టుకున్ననాడో చెప్పామంటే అమ్మ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయిపోతుంది. ఇంటి పనులతో తీరిక లేకుండా గడిపే వాళ్లకు అందం మీద శ్రద్ధ పెట్టే అవకాశమే తక్కువ. నిజానికి సౌందర్య పోషణ మీద ఆడవాళ్లెవరికైనా ధ్యాస ఉంటుంది కానీ, అందుకు తగ్గ సమయం దొరకడమే కష్టం. అందుకే మదర్స్ డే నాడు అమ్మ కోసం ‘స్పా జార్’ను బహుమతిగా ఇవ్వండి. అందులో స్క్రబ్, ఫేస్ ప్యాక్, బాడీ ఆయిల్, మంచి సబ్బు, మస్కరా, లిప్‌స్టిక్, కాంపాక్ట్, నెయిల్‌పాలిష్… ఇలా విభిన్న రకాల ఉత్పత్తులను ఉంచండి. వాటన్నిటినీ ఓ వెరైటీ గాజు జార్లో ప్యాక్ చేసి, అమ్మ గురించి క్రియేటివ్ కొటేషన్ రాసిన రంగుల కాగితాన్ని అందంగా అతికించి బహుమతిగా ఇచ్చేయండి. ఆమె కోసం ఆమె కొంత సమయాన్ని కేటాయించుకునే అవకాశాన్నీ ఇవ్వండి. ఇక, అమ్మ అందం ఆ ఆనందంతో రెట్టింపవడం ఖాయం!
కొందరు అమ్మలకు పర్ఫ్యూమ్లంటే ఎంతో ఇష్టం ఉంటుంది. కొత్తచీర కట్టుకున్నప్పుడో, మంచిగా తయారైనప్పుడో సువాసనలు గుబాళించేలా పర్ఫ్యూమ్ను అద్దుకుని ఆనందిస్తారు. అయితే సెంట్లు అనేవి మన దగ్గర లగ్జరీ వస్తువుల కిందికి వస్తాయి కాబట్టి, ఇంట్లో ఉన్నవేవో వాడతారే తప్ప వాళ్లకు ఇష్టమైనవి ప్రత్యేకంగా కొనుక్కోరు. ఆమె ఇష్టాన్ని కనిపెడితే కనుక మంచి మంచి పర్ఫ్యూమ్ బాటిళ్లు, తేలికపాటి పూల వాసనలు వచ్చే అత్తర్లలాంటివి ఆకట్టుకునేలా బుట్టలాంటి దాంట్లో ప్యాక్ చేసి అందిస్తే, అది ఆమెకు ఎంతో అపురూపమైన కానుక అవుతుంది.
మనకు అమ్మ రోజూ ఇచ్చే కానుక ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారం. అంతేకాదు, మనకు నచ్చిన ఆహారం కూడా. పిల్లలకు ఇష్టం అని అమ్మ ఎప్పుడూ మన అభిరుచుల్ని బట్టే వంటచేస్తుంది. మరి మనకిష్టమైనవి వండిపెట్టే అమ్మకు ఏమి ఇష్టమో తెలుసుకోవడం, వాటిని ఈ ప్రత్యేకమైన రోజున మన అన్నపూర్ణ కోసం వండిపెట్టడం అన్నది ఆమెకి మనమిచ్చే వెలకట్టలేని బహుమతి. ఆ రోజు స్పెషల్స్ అన్నీ ఆమె కోసమే స్పెషల్ అనిపించేలా మంచి భోజనాన్ని తయారుచేసి ఆమె ముందు ఉంచి, కుటుంబంతో కలిసి విందారగించండి. ఇది తప్పకుండా ఆమెను ఆనందపరిచే కానుకే అవుతుంది. కాస్త ముందునుంచీ ప్రాక్టీస్ చేస్తే ఆ రోజు అదరగొట్టేయొచ్చు కూడా!
పచ్చని చెట్లు పెంచి రంగురంగుల పూలు పూయించి ఇంటిని నందనవనంలా తీర్చిదిద్దుతుంటారు కొందరు అమ్మలు. వాటి పెంపకంలోనే వాళ్ల ఆనందం దాగుంది. అలాంటి వాళ్లకు తోటపనిలో పనికొచ్చే వస్తువులు, అందమైన పూలచెట్ల గింజలు, ముచ్చటైన మొక్కలు అన్నిటినీ కలిపి విభిన్నంగా ప్యాక్ చేసి, బహుమతిగా అందించండి. తమ అభిరుచిని అర్థం చేసుకుని, దాన్ని పెంపొందించుకునేందుకు సాయపడేలా ఉన్న మీ కానుక ఆమెను తప్పకుండా సంతోషపెడుతుంది. కాబట్టి గార్డెన్ గిఫ్ట్ బాస్కెట్ ఐడియాలను నెట్లో వెతికితే బోలెడు రకాలు వస్తాయి. వాటిలో మీరు మెచ్చింది చేసి అమ్మకు నచ్చేయండి!