ఇద్దరు మిత్రులు ఎడారి గుండా నడుస్తున్నారు. అలా పోతూ ఉండగా ఇద్దరి మధ్య ఏదో విషయంలో వాదులాట జరిగింది. కోపంలో ఒకడు తన మిత్రుణ్ని చెంపమీద కొట్టాడు. అయితే, చెంపదెబ్బ తిన్న వ్యక్తి ‘నా మిత్రుడు నన్ను కొట్టడంతో, ఈ రోజు నా మనసు గాయపడింది’ అని ఇసుక మీద రాశాడు. ఆ తర్వాత వాళ్లు యథావిధిగా తమ నడక కొనసాగించారు. కొంచెం సేపటికి ఓ ఒయాసిస్సు దగ్గరికి చేరుకున్నారు. అందులో స్నానం చేసి అలసట తీర్చుకోవాలని అనుకున్నారు. ఇంతలో చెంపదెబ్బ తిన్న మిత్రుడు ఒయాసిస్సులో మునిగిపోతున్నాడు. అంతే అతని మిత్రుడు అంతకుముందటి సంఘటనను ఏమీ పట్టించుకోకుండా తన స్నేహితుణ్ని ఆపద నుంచి కాపాడాడు. ప్రాణభిక్ష పెట్టాడు.
ఒయాసిస్సు నుంచి బయటికి వచ్చిన తర్వాత… ‘ఈ రోజు నా ప్రాణస్నేహితుడు నన్ను రక్షించాడు’ అని చెంపదెబ్బ తిన్న వ్యక్తి రాతిమీద చెక్కాడు. అప్పుడు రెండో వ్యక్తి తన స్నేహితుడు చేసినదానికి ఆశ్చర్యపోయాడు. “నేను కొట్టిన విషయాన్నేమో ఇసుకమీద రాశావు. మరిప్పుడేమో నేను కాపాడిన విషయాన్ని రాయి మీద చెక్కావు. ఎందుకు?” అని ప్రశ్నించాడు.
అప్పుడు చెంపదెబ్బ తిన్న వ్యక్తి.. “మన మిత్రులెవరైనా అనుకోకుండా మనల్ని గాయపరిస్తే, ఇసుక మీద రాస్తే ఆ బాధ తీరిపోతుంది. విషయం గాలికి కొట్టుకుపోతుంది. అదే సాయం చేసినప్పుడు మాత్రం ఎప్పటికీ గుర్తుండేలా శిల మీద చెక్కాలి. అప్పుడే మిత్రుడి గొప్పతనం, అవసరం ప్రపంచానికి తెలిసి వస్తుంది” అని బదులిచ్చాడు. ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా మనం కూడా మిత్రులతో తలెత్తిన విభేదాలు మర్చిపోదాం. మంచిని మాత్రమే గుర్తుంచుకుందాం. స్నేహాన్ని శాశ్వతం చేసుకుందాం.