బీపీకి మంచి పండ్లు
అధిక రక్తపోటు ఉన్నవాళ్లు ఆపిల్, అరటిపండ్లు తింటే మంచిదట. ‘ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్’ అనే జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం ఈ విషయం వెల్లడించింది. వారంలో మూడు నుంచి ఆరుసార్లు ఆపిల్ గానీ లేదంటే అరటిపండ్లుగానీ తిన్నవారు అన్ని రకాలైన కారణాల వల్ల మరణించే ముప్పు 40 శాతం వరకు తక్కువగా ఉందట. అయితే దీనికి కారణం ఏంటనేది మాత్రం పరిశోధకులు ఇదమిత్థంగా తేల్చలేదు. కాకపోతే అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో దోహదపడుతుంది. కాగా పియర్స్, ద్రాక్ష, అనాస పండ్ల నుంచి ఇలాంటి ప్రయోజనాలు దక్కవట.
వీరికి నాక్టూరియా సమస్య
ఇప్పుడు ఎక్కువసేపు టీవీలు, స్మార్ట్ఫోన్లలో వీడియోలు చూసేవాళ్లే కనిపిస్తున్నారు. అయితే రోజుకు అయిదు గంటలకంటే ఎక్కువ వీడియోలు చూసేవాళ్లలో… రాత్రిళ్లు తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వచ్చే నాక్టూరియా అనే సమస్య తలెత్తుతుందట. ఇది రాత్రి నిద్రకు ఆటంకం కలిగించడమే కాకుండా అధిక రక్తపోటు, గుండె కవాటాల వ్యాధుల ముప్పును పెంచుతుందట. టీవీలు, వీడియోలు చూడటానికి నాక్టూరియాకు మధ్య సంబంధం ఏంటనేది తెలియదు. ఎక్కువసేపు తెరలకు అతుక్కుపోయి కూర్చోవడం టైప్ 2 డయాబెటిస్ ముప్పును పెంచుతుంది. నాక్టూరియా ముప్పు కారకాల్లో టైప్ 2 డయాబెటిస్ ఒకటి కావడం గమనార్హం. అంతేకాకుండా వీడియోలు చూస్తూ నీళ్లు, ఇతర పానీయాలు తీసుకుంటూ ఉంటారు. ఇది కూడా తరచుగా మూత్రానికి దారితీస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ అధ్యయనం ‘న్యూరోయూరాలజీ అండ్ యూరోడైనమిక్స్’లో ప్రచురితమైంది. స్క్రీనింగ్ టైం తగ్గించుకోవాలి మరి!