మంచి ఆహారం, కంటినిండా నిద్ర, నిత్య వ్యాయామం.. మనిషికి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. జీవనశైలిలో మార్పులతోపాటు వివిధ వ్యాయామాలు, హెల్త్ సప్లిమెంట్ల వంటివి వృద్ధాప్య ప్రక్రియను తిప్పికొడతాయని అంటున్నారు. ఈ మేరకు ‘యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్’ ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో పలు విషయాలను వెల్లడించారు.
ఇందులో భాగంగా 45 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు గల ఆరుగురు మహిళలను ఎంచుకున్నారు. వీరిని ఎనిమిది వారాలపాటు అబ్జర్వేషన్లో ఉంచి.. ఒక్కొక్కరూ ఒక్కోరకం ఆహారం, నిద్ర, వ్యాయామం చేయాల్సిందిగా సూచించారు. ప్రోబయోటిక్, ఫైటోన్యూట్రియెంట్ సప్లిమెంట్లు, పోషకాహార అలవాట్లపైనా అవగాహన కల్పించారు.
ఎనిమిది వారాల తరువాత ఆరుగురికీ వివిధ రకాల రక్త పరీక్షలు నిర్వహించారు. అయితే, విచిత్రంగా ఈ ఆరుగురు మహిళల్లో ఐదుగురిలో.. జీవసంబంధమైన వయసులో 11 ఏండ్ల వరకూ తగ్గుదల కనిపించినట్లు పరిశోధకులు వెల్లడించారు. మనిషి బాహ్య జన్యువుల్లో కొన్నిరకాల రసాయన సమ్మేళనాలు ఉంటాయనీ.. అవి ఒత్తిడి, ఆహారం, మందులు, కాలుష్యం వంటివాటితో ప్రభావితం అవుతాయని వారు చెబుతున్నారు. జీవనశైలిలో మార్పులు, మంచి ఆహారపు అలవాట్లు.. ఈ రసాయన సమ్మేళనాలను స్థిరంగా ఉంచుతాయనీ, వృద్ధాప్యాన్ని వ్యతిరేకించేలా శరీరాన్ని ప్రోత్సహిస్తాయనీ వెల్లడించారు.