ఆధునిక కాలంలోనూ సంప్రదాయ ఆభరణాలు అత్యంత ఆదరణ పొందుతున్నాయి. తళుకుబెళుకుల మెరుపులకంటే సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా తయారైన పురాతన ఆభరణాలపైనే మక్కువ చూపుతున్నారు నేటి మగువలు. అలా ఈతరం మహిళలను మెప్పిస్తున్న ప్రాచీన నగల్లో ఒకటి ఫిలిగ్రీ జువెలరీ. తాతమ్మల నాటి ఆభరణాల్లో ఒకటైన ఫిలిగ్రీ నగల విశేషాలేంటో తెలుసుకుందాం..
ఫిలిగ్రీ పురాతనమైన ఆభరణాల తయారీ పద్ధతి. ఇందులో చాలా సన్నని, మెలితిప్పిన బంగారం, వెండి తీగలను ఉపయోగించి సున్నితమైన లేస్ లాంటి నమూనాలను రూపొందిస్తారు. ఈ అధునాతన కళారూపాలను తయారు చేసేందుకు అసాధారణ నైపుణ్యం, కచ్చితత్వం, సహనం అవసరం. 5000 సంవత్సరాల క్రితం మెసపటోమియాలో ఈ ఫిలిగ్రీ కళ పుట్టింది. ఈజిప్టు, గ్రీస్, భారత్, ఐరోపా దేశాలు సహా అనేక నాగరికతల్లో వ్యాపించింది. మనదేశంలో తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ర్టాలలో ఈ కళ విస్తృతంగా ఉంది. తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫిలిగ్రీ కళకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది.
ఈ నగల తయారీకి స్వచ్ఛమైన బంగారం లేదా స్టెర్లింగ్ సిల్వర్లను ఉపయోగిస్తారు. నమూనాల తయారీకి అనువైన మెత్తదనం, మన్నిక ఆధారంగా ఈ లోహాలను ఎంచుకుంటారు. లోహాన్ని చాలా సన్నని, ఏకరీతి దారాలుగా తీసి గుండ్రని, సంక్లిష్టమైన డిజైన్లుగా మలుస్తారు. ఈ నగల తయారీకి ప్రత్యేక పరికరాలు, వారసత్వ హస్తకళ అవసరం. సంక్లిష్ట రేఖాగణిత, పుష్ప నమూనాలను సృష్టించి అందమైన ఆభరణాలుగా మలుస్తారు. ఎనామిల్‌ను జతచేసి ఆభరణాలు అనేక రంగుల్లో మెరిసిపోయేలా సొబగులు అద్దుతారు. హస్తకళలను ఇష్టపడేవారికి ఇవి మంచి ఎంపిక. అందమైన అల్లికతో కూడిన కంఠాభరణాలు, హారాలు, చెవి కమ్మలు, గాజులు, చోకర్లు, బ్రేస్లెట్లు.. ఇలా అన్ని రకాల నగలు అందుబాటులో ఉన్నాయి.
ఫిలిగ్రీ నగల తయారీకి ఉపయోగించిన లోహం, సంక్లిష్టత ఆధారంగా రూ.5,000 నుంచి లక్షల రూపాయల ఖరీదు చేసే వాటి వరకు రకరకాల డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. మనిషి సృజనాత్మకతకు, సహనానికి, సునిశితంగా రూపొందించే ఫిలిగ్రీ ఆభరణాలు నిదర్శనంగా నిలుస్తాయి. సంప్రదాయ కళాత్మకతను సమకాలీన సౌందర్య సున్నితత్వంతో కలబోసి తయారుచేసిన అనేకరకాల ఆధునిక డిజైన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓసారి ట్రై చేసేయండి!