ఆరోగ్యం కోసం, ఫిట్నెస్ కోసం జిమ్‌లో చేరిందా అమ్మాయి.సరదాగా కసరత్తులు చేస్తుందేమో అనుకున్నారు.అక్కడితో ఆగకుండా ‘మిస్ ఫిజిక్ ఆఫ్ తెలంగాణ’ టైటిల్ గెలుచుకుంది. మహిళా బాడీ బిల్డర్‌గా సత్తా చాటుకున్నది. ఎంతోమందికి ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తూ మహిళలు అరుదుగా కనిపించే బాడీ బిల్డింగ్‌లో దూసుకుపోతున్నది.. కీర్తి చెన్న.
Keerthi1
అందరిలా ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని, విజయం సాధించాలనుకుని ఉంటే.. ఆమె మిగిలిన ఆడపిల్లల్లో ఒకరిగా మిగిలిపోయేది. కానీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. రోల్ మోడల్ కావాలనుకుంది. అందుకే, ఏ అమ్మాయీ తీసుకోని నిర్ణయం తీసుకుంది. బాడీ బిల్డింగ్ మీద ఆసక్తి పెంచుకుంది. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పింది. ‘అబ్బాయిల్లా కండలు పెంచుతావా? వద్దు’ అంటూ అడ్డు చెప్పారు. కీర్తి తండ్రి పోలీస్ ఆఫీసర్. ఇంట్లో అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే. అటువైపు ప్రయత్నాలు చేయమని సూచించారు. కానీ, కీర్తి వినలేదు. అప్పటికే తను ఫిక్స్ అయిపోయింది. కాస్మటాలజీ కోర్సు చేసినా అందులో ఎక్కువరోజులు కొనసాగలేదు. కొంతకాలం ఖాళీగానే ఉంది. ఆ సమయంలో బరువు పెరుగుతున్న ఛాయలు కనిపించడంతో.. వెంటనే జిమ్‌లో చేరాలనుకుంది.
మిస్ ఫిజిక్ తెలంగాణ
హైదరాబాద్‌లో ఓ మంచి జిమ్‌ను ఎంచుకునే క్రమంలో.. చాలా ప్రయత్నాలే చేసింది. ఆధునిక ఎక్విప్మెంట్, ఎయిర్ కండిషన్డ్ వాతావరణం.. అన్నీ బాగానే ఉన్నా ఒకటే సమస్య. ఎక్కడ చూసినా మగ ట్రైనర్లే కనిపించేవారు. ‘ఆడవాళ్లు ఎందుకు లేరు? ఆ బాధ్యత నేను ఎందుకు తీసుకోకూడదు?’ అనిపించింది. తక్షణం ఆ ఆలోచనను అమలు చేసింది. అలా అని, తనేం ఏక్దమ్ ఫిట్ రకం కాదు. సాధారణంగానే ఉంటుంది. ట్రైనర్ కావాలంటే ముందు తాను ఫిట్‌గా ఉండాలి కదా! అందుకే, కష్టపడి కసరత్తులు చేసింది. ఆహార విధానం మార్చుకుంది. అబ్బాయిలకు తొందరగా కండలు వచ్చేస్తాయి. అమ్మాయిలకు అలా కాదు. ఎంతో కష్టపడాలి. కండలు తిరిగిన దేహం కోసం కీర్తి రెండేండ్లపాటు కఠోరమైన సాధన చేసింది. తన మీద తనకు నమ్మకం పెరిగాక.. పోటీలకు వెళ్లసాగింది. తొలి విజయంగా.. హైదరాబాద్‌లో జరిగిన వుమెన్ బాడీ బిల్డర్ ఛాంపియన్‌షిప్‌లో ‘మిస్ ఫిజిక్ ఆఫ్ తెలంగాణ’ టైటిల్ గెలుచుకుంది.
Keerthi2
పేరు నిలబెడతా..
రాటుదేలుతున్న కీర్తి శరీరాకృతిని చూసి ఇంట్లోవాళ్లు కంగారుపడ్డారు. ఇలా అయితే ఎవరూ పెండ్లి చేసుకోరని వారించారు. ‘ఇంట్లో ఇద్దరం అమ్మాయిలమే కదా.. నన్ను మీ కొడుకు అనుకోండి’ అని సర్దిచెప్పింది. అప్పటినుంచి ఎవరూ అడ్డు చెప్పలేదు. రోజూ రెండు పూటలా జిమ్ చేసి కండలు పెంచింది. ఆ సమయంలో తనకు ఇష్టమైన రుచులను వదిలేసింది. స్టీమ్డ్ ఫుడ్, బాయిల్డ్ చికెన్, సాల్మన్ ఫిష్, ఎగ్‌వైట్ డైట్లో భాగం చేసుకుంది. దాంతోపాటే జిమ్ ట్రైనర్‌గా కొనసాగింది. వివిధ పోటీల్లో పాల్గొన్నది. జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకున్నది. అంతర్జాతీయంగా తెలంగాణ పేరు నిలబెట్టేందుకు తన వంతు కృషి చేస్తానని చెబుతున్నది కండలరాణి కీర్తి.
కండల రాణి అనిపించుకోవడం ఏ అమ్మాయికైనా కష్టమే. అందుకు శ్రమపడాలి. పోటీలు ఉన్నప్పుడు మరిన్ని వర్కవుట్స్ చేయాలి. ఆహారం విషయంలో కఠినంగా ఉండాలి. కొన్నిసార్లు ఇట్టే అలసట వచ్చేస్తుంది. అవన్నీ తట్టుకొని నిలబడటం మామూలు విషయం కాదు. అందులోనూ, బాడీ బిల్డింగ్ రంగంలో అమ్మాయిలు తక్కువ. గతంలో నేను కూడా అందరు అమ్మాయిల్లానే ఉండేదాన్ని. చిన్నచిన్న విషయాలకే భయపడేదాన్ని. ఇప్పుడు అలా కాదు. చాలా స్ట్రాంగ్ అయ్యాను. రెగ్యులర్ వర్కవుట్స్, బాడీ బిల్డింగ్ నాలో ధైర్యాన్ని పెంచాయి.
…? సుంకరి ప్రవీణ్ కుమార్
రాజేష్ నర్రె
Keerthi3