ఫ్యాషన్‌గా కనిపించడం ఎంత ముఖ్యమో బడ్జెట్‌ను ఫాలో అవడం కూడా అంతే ప్రధానం. అవ్వా కావాలి, బువ్వా కావాలి అంటే ఎలా కుదురుతుంది అనుకోనక్కర్లేదు. ఇదిగో ఈ చిన్న టిప్స్ పాటిస్తే జేబుకు చిల్లు పడకుండానే జోర్దార్గా కనిపించొచ్చు!
ఫ్యాషన్‌గా కనిపించడం ఎంత ముఖ్యమో బడ్జెట్‌ను ఫాలో అవడం కూడా అంతే ప్రధానం. అవ్వా కావాలి, బువ్వా కావాలి అంటే ఎలా కుదురుతుంది అనుకోనక్కర్లేదు. ఇదిగో ఈ చిన్న టిప్స్ పాటిస్తే జేబుకు చిల్లు పడకుండానే జోర్దార్గా కనిపించొచ్చు!
ముందు మీ బీరువాలో ఉన్న దుస్తులన్నీ తీసి ఓ దగ్గర పెట్టండి. అందులో సరిగ్గా వాడనివి కనిపిస్తాయి. బాగా వాడినవీ కనిపిస్తాయి. అప్పటికి రంగు నచ్చకో, ఫిట్టింగ్ కుదరకో మరే కారణాలతోనో వేసుకుని ఉండం. వాటిని తీసి సరిచేయించడం లేదా వేరే వాటితో మ్యాచ్ చేసి వాడుకోవడం లాంటివి చేయొచ్చు. ఇక, బాగా వాడేసి బోర్ కొట్టిన వాటిని ఎవరికైనా ఇచ్చేయొచ్చు.
మన వార్డ్రోబ్ ైస్టెలిష్‌గా ఉండాలి అనుకున్నప్పుడు అందుకోసం ఎంత బడ్జెట్ పెట్టుకుంటున్నాం, ఏమేం కొనాలి అనుకుంటున్నాం అన్నది చూడాలి. దాన్ని బట్టే ఏం కొనాలి, ఏం కొనక్కర్లేదు అన్నది తేలుతుంది. అలా కాకుండా ముందుకు వెళితే చాలామంది అనవసరమైన ఖర్చే చేస్తారు.
బెల్టులు, గొలుసులు, ఉంగరాలు, లెదర్ జాకెట్లు, ఓవర్ కోట్ల లాంటివి మీ దగ్గర ఆల్రెడీ ఏం ఉన్నాయి, వాటికి ఏమైనా మ్యాచింగ్ చేస్తే సరికొత్తగా కనిపించవచ్చా అన్నది చూడండి. రెండు మూడింటికి సరిపడేలా షూస్ కానీ, కోట్లు కానీ ఎంచుకోండి. అంటే బ్లూ జీన్స్, వైట్ షర్ట్లాంటివి ఎన్నింటికి సరిపోతాయి… అలా అన్నమాట. అప్పుడు ఒకే ధరలో రెండు మూడు అవుట్ఫిట్లు కొన్నట్టే.
మీ కజిన్స్ లేదా స్నేహితులతో థ్రిఫ్టింగ్ చేసే ప్రయత్నం చేయండి. అంటే, కొత్తగా ఉండి కూడా ఇక వేసుకోబుద్ధికాని లేదా వేసుకున్నది చాల్లే అనిపించిన దుస్తులు వాళ్లకి ఇచ్చి, వాళ్ల దగ్గరా అలాంటి దుస్తులే ఉంటే వాటిని తీసుకోవడం. అప్పుడు అవి మీకు సరదాగా వేసుకోవాలనిపిస్తాయి. వాళ్లకు కూడా కొత్తగా కనిపించిన అనుభూతి కలుగుతుంది.
సాదా టీ షర్టు మీద ఏదైనా ప్యాచ్ వేసి ఐరన్ చేసి కొత్త లుక్ తేవచ్చు. వాడిన టీషర్ట్‌ను చేతులు కత్తిరించి ట్యాంక్ టాప్‌గా మార్చి ఫ్యాషన్‌గా ట్రై చేయొచ్చు. ఒకదాని మీద ఒకటి వేసుకునే టీషర్ట్లు, చొక్కాలను మిక్స్ అండ్ మ్యాచ్ మోడల్లో వేసుకుని ట్రెండీగా కనిపించవచ్చు. ఇవన్నీ ట్రై చేశాక, ఇంకా ఏమైనా న్యూ లుక్ కావాలి, హాట్ ఫ్యాషన్ ఉంది అనిపిస్తే మంచి ఆఫర్ చూసి కొనుక్కుంటే సరి!