నా వయసు ముప్పై నాలుగు. మాది ప్రేమ వివాహం. పెండ్లయి తొమ్మిదేండ్లు. ఆరేండ్ల బాబు ఉన్నాడు. నా భర్తకు మంచి ఉద్యోగం. చాలా హాయిగా బతికాం. సరిగ్గా ఏడాది క్రితం ఆయనకు వివాహేతర సంబంధం ఉందని తెలిసింది. మొదట్లో నేను నమ్మలేదు. ఆరా తీస్తే నిజమేనని తెలిసింది. గట్టిగా నిలదీశాను. మొదట ఒప్పుకోలేదు. ఆధారాలతో నిరూపిస్తే అంగీకరించాడు. పెద్ద గొడవే జరిగింది. తర్వాత తనే ఆ మహిళతో విడిపోవాలనే ఉద్దేశం ఉందని చెప్పాడు.
నన్ను క్షమాపణ కోరాడు. మరోసారి తప్పు చేయనని కొడుకుపై ప్రమాణం చేశాడు. వీటన్నిటితో చాలా కుంగిపోయాను. ఎంతైనా భర్త కదా అని క్షమించాను. నేను ఇంత స్ట్రగుల్ అవుతుంటే, అతను మాత్రం సాధారణ స్థితికి రావడానికి వారం కూడా పట్టలేదు. ఏమీ ఎరుగనట్లే వ్యవహరిస్తున్నాడు. అతనిపై అనుమానం పూర్తిగా పోలేదు. నాలో అభద్రతా భావమూ అలాగే ఉంది. మునుపటిలా ప్రేమగా ఉండమని చాలా ఒత్తిడి చేస్తున్నాడు. ఎందుకో, ఆ మాటతీరు కూడా నాకు నచ్చడం లేదు. నేనేం చేయాలి?
– ఓ సోదరి
మీ కోపం న్యాయమైందే. ప్రేమించి పెండ్లి చేసుకున్న వ్యక్తి దారితప్పితే.. ఆ బాధ మాటల్లో వర్ణించలేం. ఈ సమయంలో మీరు ధైర్యంగా ఉండాలి. ప్రతి చిన్న విషయాన్నీ మనసులోకి తీసుకోకండి. కొడుకు కోసమే మీతో వివాహబంధాన్ని కొనసాగిస్తున్నాడనే భావనను బుర్రలోంచి తీసేయండి. అతను తప్పు ఒప్పుకొన్నాడు కాబట్టి.. మీరూ క్షమించారు. మీ మీద నిజమైన ప్రేమ ఉంటే.. మరోసారి తప్పు చేసే సాహసం చేయడు. అందుకే, అన్నిటికంటే ముందు మీ భర్తతో మనస్ఫూర్తిగా మాట్లాడండి.
మీ భావోద్వేగాలను పంచుకోండి. మీ బాధను, భయాల్ని వెళ్లగక్కండి. మీ జీవిత ప్రణాళికలు వివరించండి. ప్రస్తుతం, అతను మీ భావాలను పట్టించుకోకుండా.. సాధారణ స్థితికి వచ్చేయమని అంటున్నాడు. అందుకు కొంత సమయం పడుతుందనే విజ్ఞత అతనికి లేకపోవచ్చు. మధ్యేమార్గంగా మీ కాళ్లపై మీరు నిలబడే ప్రయత్నం చేయండి. ఖాళీగా ఉంటే అనేకానేక ఆలోచనలు చుట్టుముడతాయి. మీకిప్పుడు ఆత్మబలమే కాదు, ఆర్థిక స్వేచ్ఛా కావాలి. ఏ నిర్ణయం తీసుకోవడానికైనా కొంత సమయం
అవసరం. మరికొన్ని రోజులు సహనం తప్పదు.