ఎర్రటి ఎండలో కాస్తంత దూరం నడవగానే చెమటలు కారిపోతాయి. తీవ్రంగా అలసిపోతాం. దాహమేస్తుంది. ఆ సమయంలో నోరూరించే మిల్క్‌షేక్ కనిపిస్తే? మరో ఆలోచన లేకుండా లాగించేస్తాం. కమ్మకమ్మని.. చిక్కచిక్కని.. మిల్క్‌షేక్‌ను ఏ సీజన్లో అయినా కాదనలేం. బాదం, బనానా, మ్యాంగో, స్ట్రాబెర్రీ.. ఇలా రకరకాల షేక్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. నోటికి కాస్త రుచిగా అనిపించినా, వీటివల్ల ఆరోగ్యానికి చేటే అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వీటి కంటే పండ్లరసాలే మేలని సూచిస్తున్నారు.
చాలామంది మిల్క్‌షేక్ అనగానే స్వచ్ఛమైన పాలు, పండ్లతో చేస్తారనుకుంటారు. నిజానికి అవేవీ అసలు పండ్లు కాదు. రుచి కోసం రసాయన ఫ్లేవర్స్ కలుపుతారంతే. నిజమైన పాలు, పండ్లు వాడినా కూడా.. ఈ కాంబినేషన్ సరికాదని చెబుతున్నది ఆయుర్వేదం. దీనివల్ల ఎన్నో జీర్ణ సంబంధ రుగ్మతలకు అవకాశం ఇచ్చినట్టే. గ్యాస్ట్రిక్ సమస్య, వికారం, ఎసిడిటీ, ఛాతీలో మంటతోపాటు పేగు సంబంధ వ్యాధులకు మిల్క్ షేక్స్ కారణం అవుతున్నాయట. అందులోనూ బనానా మిల్క్ షేక్స్ సైనస్ గ్రంథులపై ప్రభావం చూపుతాయట. మ్యాంగో మిల్క్‌షేక్ పేగు సమస్యలకు కారణం అవుతుందట. తయారీ సమయంలో కల్తీ నీళ్లు వాడినట్టయితే.. మరిన్ని రోగాలను పుచ్చుకున్నట్టే. కాబట్టి, జాగ్రత్త!