జపాన్‌వాసులు ఏది చేసినా పద్ధతిగానే ఉంటుంది. టెక్నాలజీ, ఆహారం, క్రమశిక్షణ.. ఇలా ఏ విషయం తీసుకున్నా ప్రత్యేకంగానే నిలుస్తుంది. ఇప్పుడు వాకింగ్‌లోనూ.. మరో కింగ్‌లాంటి పద్ధతిని తీసుకొచ్చారు. అదే.. ఇంటర్వెల్ వాకింగ్. మామూలు నడకతో పోలిస్తే.. ఈ ఇంటర్వెల్ వాకింగ్ ద్వారా మరిన్ని అదనపు ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
వేగాన్ని మార్చుకుంటూ నడక సాగించడమే ఇంటర్వెల్ వాకింగ్ పద్ధతి. మొదటగా వాచ్ లేదా ఫోన్లో మూడు నిమిషాల వ్యవధితో టైమర్‌ను సెట్ చేసుకోవాలి. నడకను ప్రారంభించి.. మొదటి మూడు నిమిషాలపాటు నెమ్మదిగా కొనసాగించాలి. ఆ తర్వాతి మూడు నిమిషాలు వేగంగా నడవాలి. మళ్లీ మూడు నిమిషాలు వేగాన్ని తగ్గించాలి. ఇలా 30 నిమిషాల పాటు వేగాన్ని తగ్గిస్తూ. పెంచుతూ నడక సాగించాలి.
ఇప్పటివరకు రోజుకు 10వేల అడుగులు వేయడమే నడకలో ఉత్తమమైన వ్యాయామంగా గుర్తింపు పొందింది. అయితే, ఎన్ని అడుగులు వేయాలన్న విషయాన్ని పక్కన పెడితే.. జపాన్‌వాసులు ఫాలో అవుతున్న ఇంటర్వెల్ వాకింగ్‌తో అనేక ప్రయోజనాలు ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. మూడు నెలలపాటు వారానికి మూడుసార్లు.. 30 నిమిషాల ఇంటర్వెల్ వాకింగ్ చేసిన వారిలో రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గినట్లు గుర్తించారు. వారి కాళ్లలో బలం పెరిగిందనీ, మామూలు వాకింగ్ చేసేవారితో పోలిస్తే వీరిలో ఏరోబిక్ సామర్థ్యం పెరిగినట్లు తేల్చారు. అంతేకాకుండా.. ఇంటర్వెల్ వాకింగ్‌లో ఎక్కువ కేలరీలు ఖర్చయ్యే అవకాశం ఉంది. వేగంగా నడిచే సమయంలో హృదయ స్పందన రేటు పెరుగుతుంది. దాంతో గుండె ఆరోగ్యానికి భరోసా దక్కుతుంది.