ప్రేమ సంగతి ఎలా ఉన్నా.. పెండ్లి మాత్రం అనేక షరతులతో కుదురుతుంది. మిగతా విషయాలను పక్కన పెడితే.. వివాహబంధంలో ‘వయసు’ కీలకపాత్ర పోషిస్తుంది. అయితే, నేటి ఆధునిక యువత.. ప్రేమ వివాహాలకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నది. ఈ క్రమంలో ‘వయోబేధం’లో తేడా కొడుతున్నది. ఫలితంగా అభిప్రాయబేధాలు తలెత్తి.. ‘కాపురం’ అల్లకల్లోలంగా మారుతున్నది. సంతానోత్పత్తి కూడా సమస్యగా మారుతున్నది. అయితే.. భార్యాభర్తల మధ్య వయసులో ఎంత తేడా ఉంటే మంచిది? ఈ ప్రశ్నకు నిపుణులు చెబుతున్న సమాధానం ఇది..
నేటితరంలో ఎక్కువగా ప్రేమ వివాహాలే చేసుకుంటున్నారు. దాంతో.. దంపతులిద్దరూ ఒకే వయసువారై ఉంటున్నారు. ఇలాంటి దంపతుల మధ్య అండర్స్టాండింగ్ బాగుంటుందట. సంతానోత్పత్తికీ ఎలాంటి సమస్యలూ ఉండవట. అయితే, అభిప్రాయ బేధాలు వస్తే మాత్రం.. ఇద్దరిలో ఎవరూ సర్దుకుపోయేందుకు మొగ్గుచూపరట. పంతాలకు పోయి.. తెగేదాకా లాక్కుంటారట.
భార్యాభర్తల మధ్య ఐదు నుంచి ఆరేండ్ల తేడా ఉంటే మంచిదన్నది నిపుణుల మాట. ఇలాంటి జంటల మధ్య అవగాహన బాగుంటుందట. అభిప్రాయాలు కలవడం.. సంతాన సాఫల్యతకు ఇబ్బంది లేకపోవడం వీరికి కలిసొచ్చే అంశాలు. వయసులో తేడా తక్కువగా ఉండటం వల్ల వీరికి ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారట. అభిప్రాయబేధాలు వచ్చినా.. సర్దుకుపోతారట.
పదేండ్ల తేడా ఉంటే.. ఇద్దరి మధ్య ప్రేమ బాగుంటుందట. ఒకరినొకరు గౌరవించుకుంటారట. అభిప్రాయాల్లో కొద్దిగా తేడాలు ఏర్పడినప్పటికీ.. సర్దుకుపోయేందుకే మొగ్గు చూపుతారట. ఇక వీరిలో సంతానానికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు చెబుతున్నారు. జీవిత లక్ష్యాలు, ఆశయాలు, దృక్పథాలు కలిస్తే.. ఈ పదేండ్ల తేడా వారి కాపురంపై పెద్దగా ప్రభావం చూపించదని నిపుణుల మాట.
కారణాలేవైనా.. కొందరు దంపతుల్లో వయసు తేడా ఎక్కుగా కనిపిస్తుంది. కొన్ని జంటల్లో 15 ఏండ్లకు మించి కూడా తేడా ఉంటుంది. ఇలాంటివారిలో తరచుగా అభిప్రాయబేధాలు తలెత్తుతాయట. వారి ఆశయాల్లో, లక్ష్యాల్లోనూ తేడాలు కనిపిస్తాయి. ముఖ్యంగా.. వయసులో ఈ తేడా సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.