రోజూ జిమ్, వాకింగ్, యోగా… చేసుకుంటూ ఫిట్‌గా ఉండటానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. కానీ ఫ్లెక్సిబిలిటీ సంగతేంటి? దీన్ని మాత్రం చాలామంది పట్టించుకోరు. వయసు పెరిగేకొద్దీ ఈ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతే.. నడకలో ఇబ్బంది, నడుము నొప్పి, జాయింట్ స్టిఫ్నెస్ లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి రోజువారీ వ్యాయామాల్లో స్ట్రెచింగ్కి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు పది నిమిషాలు
ఈ స్ట్రెచెస్ చేయండి.. మీ బాడీ ఎంత ఫ్లెక్సిబుల్‌గా మారుతుందో చూడండి.
స్ట్రెచింగ్ అనేది కేవలం శరీరం రిలాక్స్ అవ్వడం మాత్రమే కాదు. ఇది మన కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది, జాయింట్ మొబిలిటీని పెంచుతుంది. మొత్తం శరీర ఆరోగ్యానికి బలం చేకూరుస్తుంది. స్ట్రెచింగ్ వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. అంటే కండరాలకు ఆక్సిజన్, పోషకాలు సమృద్ధిగా అందుతాయి. క్రమం తప్పకుండా స్ట్రెచింగ్ చేయడం వల్ల కీళ్లలో సైనోవియల్ ఫ్లూయిడ్ ఉత్పత్తి అవుతుంది. ఇది కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వైద్యుడి సలహా తీసుకున్న తర్వాతే వీటిని ప్రయత్నించాలి.

ఎక్కువ సమయం డెస్క్ వర్క్, స్క్రీన్ మీద పనిచేసే వారికి ఈ స్ట్రెచ్ వర్కవుట్ ఉపయోగపడుతుంది. కూర్చునే భంగిమ సరిగా లేకపోతే భుజాలు ముందుకు వచ్చినట్టుగా వంగుతాయి. ఈ సమస్యకు చెస్ట్ ఓపెనర్ స్ట్రెచ్ విరుగుడుగా పనిచేస్తుంది. ఇది ఛాతీలో బిగుతును తగ్గిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇంతకీ ఇది ఎలా చేయాలంటే.. పొట్టపై చేతులను ఉంచి భుజాలను వెనక్కి సాగదీస్తూ, తలను పైకెత్తాలి. ఇలా ఓ పదిసార్లు చేస్తే చాలు. ఛాతీ కండరాలను సాగదీస్తుంది.
చిత్రంలో చూపించిన విధంగా పోశ్చర్‌లో ఉండి… వెన్నును కిందికి స్ట్రెచ్ చేస్తూ.. ముఖాన్ని పైకి ఎత్తాలి, మళ్లీ ముఖాన్ని కిందికి దించి, వెన్నును పైకి స్ట్రెచ్ చేయాలి. ఇలా చేయడం వల్ల వెన్నముకపై ఒత్తిడి తగ్గుతుంది. స్పైన్ జాయింట్లలో సైనోవియల్ ఫ్లూయిడ్ ఉత్పత్తి వల్ల బిగుతు తగ్గి, ఫ్లెక్సిబుల్‌గా మారుతాయి.

ఎక్కువసేపు కూర్చునే వారిలో తొడ వెనుక, నడుము కింది భాగంగలో ఉండే కండరాలు బిగుతుగా తయారవుతాయి. ఇలాంటి వారికి ఈ స్ట్రెచ్ మంచి మేలు చేస్తుంది. పాదాలను ముందుకు చాపి కూర్చోవాలి. పొట్టపై ఒత్తిడి పడే విధంగా ఛాతీని ముందుకు స్ట్రెచ్ చేస్తూ.. చేతులతో పాదాలను అందుకునే ప్రయత్నం చేయాలి. దీనివల్ల తుంటి కండరాలు రిలాక్స్ అవుతాయి. నడుము నొప్పి తగ్గుతుంది.

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల హిప్ ఫ్లెక్సర్స్ బిగుతుగా మారుతాయి. ఇది వెన్నుముక కింది భాగంపై ఒత్తిడి పెంచి నొప్పి కలిగిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారు హిప్ ఫ్లెక్సర్ స్ట్రెచ్ చేయడం ద్వారా రిలాక్స్ అవ్వొచ్చు. ఇదెలా చేయాలంటే.. కుడి మోకాలిని, ఎడమ పాదాన్ని నేలపై ఉంచి చిత్రంలో చూపించిన భంగిమలో ఉండాలి. తర్వాత కుడితొడపై శరీరం బరువంతా పడేలా కాస్త ముందుకు స్ట్రెచ్ చేయాలి. ఓ ముప్పై సెకండ్లపాటు ఇలా ఉండాలి. మళ్లీ ఎడమ మోకాలిని, కుడి పాదాన్ని నేలపై ఉంచి ఇందాక చేసినట్టే చేయాలి.