మాయాబజార్ సినిమాలో సత్యపీఠం గుర్తుందిగా! దాన్ని ఎవరు అధిరోహించినా.. వాళ్లు సత్యమే పలుకుతారు. ఆఖరికి వెయ్యి శనుల పెట్టు అనిపించుకున్న శకుని మామ కూడా సత్యపీఠమెక్కి.. అప్రతిహతంగా నిజాలే చెప్పాడు! అది ద్వాపరయుగ ధర్మం! ఈ కలియుగంలో సత్యపీఠం కోసం వెతకడం అమాయకత్వమే అవుతుందనుకోండి! యుగధర్మం కాబోలు.. అసత్య పీఠాలు, అనర్థ పీఠాలు, అపార్థ పీఠాలు, అసభ్య పీఠాలుగా సామాజిక మాధ్యమ వేదికలు పరిఢవిల్లుతున్నది. అనుభవజ్ఞులైన సీనియర్ మోస్ట్ సినీ జర్నలిస్టులు కూడా యూట్యూబ్ పీఠం ఎక్కగానే.. అనవసరమైన విషయాలను అనర్గళంగా నొక్కి వక్కాణిస్తున్నారు. ముఖ్యంగా నాటి మేటి కథానాయికల జీవితాలను చులకన చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ల జీవితాల్లోకి స్వయంగా తొంగి చూసినట్టుగా రోత ముచ్చట్లు ఏకరువు పెడుతున్నారు. దశాబ్దాల అనుభవాన్ని నాలుగు మంచి విషయాలు పంచుకోవడానికి ఉపయోగించాలి! కానీ, వీళ్ల తరహా వేరు. ఈ మెరీనా బీచ్ బ్యాచ్.. మద్రాస్ మతలబులన్నీ తమకే తెలుసన్నట్టుగా గోరంతలు కొండంతలు చేసి చెబుతున్నది. ఇప్పుడు మాత్రం గాసిప్స్ లేవా! అప్పుడు ఉండకుండా ఉంటాయా!!
కాలప్రవాహంలో కొట్టుకుపోయిన చెత్తను.. తమ బుర్రల్లో భద్రంగా దాచుకొని.. ఇప్పుడు ప్రస్తావించడం ఎందుకో తెలియదు! గతాన్ని విస్మరించమని చెప్పడం లేదు! ఆయా నటీనటుల స్వ‘గతం’లోని వ్యక్తిగతాలను ప్రస్తావించడమే బాధాకరం. ప్రజల హృదయాల్లో సుస్థిరంగా ఉన్న వాళ్ల స్థానాన్ని వీళ్లు ఎందుకు టార్గెట్ చేశారో తెలియదు. ‘ఆ హీరో ఈ హీరోయిన్ను దొంగచాటుగా పెండ్లి చేసుకోవాలని అనుకున్నాడు’, ‘ఈ కథానాయికకు ఇలాంటి అలవాటు ఉండేది’ ఎంతసేపూ ఇవే మాటలు! ఈ పెద్దమనుషులను ఇంటర్వ్యూలు చేసే యాంకర్ల వంకర హావభావాలు సరేసరి! సందర్భశుద్ధి లేకుండా వాగుతూ… అగ్నికి ఆజ్యం పోస్తుంటారు. కనుచూపుతో నవరసాలొలికించిన ఆ తరం నటీనటులపై పనిగట్టుకొని పైత్య విషాన్ని చిమ్ముతూ.. అసభ్య పదజాలంతో థంబ్ నెయిల్స్ పెడుతూ.. పైశాచిక ఆనందం పొందుతున్నారు. ‘వదల బొమ్మాళీ..’ అంటూ ఈ అనుభవజ్ఞులు చేస్తున్న వీరంగం చూస్తుంటే ఏవగింపు కలగకమానదు. అప్పట్లోనే సోషల్ మీడియా ఉండి ఉంటే.. ఆ సినీతారల బతుకులు బుగ్గిపాలు అవుతాయనడంలో సందేహం లేదు!!
– కోబ్రా