‘జెన్-జీ’ తరంలో పర్యావరణంపై స్పృహ పెరుగుతున్నది. వాతావరణ మార్పులు, దాని పర్యవసానాలపై.. నవతరంలో ఆందోళన ఎక్కువ అవుతున్నది. దాంతో, ప్రతి విషయంలోనూ పర్యావరణహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నది. తాజాగా, డెలాయిట్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ సందర్భంగా 44 దేశాలకు చెందిన 23,482 మంది జెన్-జీ, మిలీనియల్స్‌తో ఈ అధ్యయనం సాగింది.
ఈ సందర్భంగా.. 65 శాతం జెన్-జీ, 63 శాతం మిలీనియల్స్‌లో పర్యావరణం గురించిన ఆందోళన వ్యక్తమవుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. వారిలో అగ్రభాగం.. పర్యావరణహితమైన ఉత్పత్తులు, సేవల కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది.
ఇందులో భాగంగా.. జెన్-జీలో దాదాపు 17 శాతం, మిలీనియల్స్‌లో 19 శాతం మంది ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను కొనుగోలు చేశారట. మరో 45 శాతం మంది పర్యావరణహితమైన వాహనాలకు మద్దతు తెలిపారు. 26 శాతం జెన్-జీ, 27 శాతం మంది మిలీనియల్స్.. తమ ఇళ్లను సౌర విద్యుత్‌కు అప్‌గ్రేడ్ చేసినట్లు వెల్లడించారు. మరో 45 శాతం మంది ఈ పంథానే అనుసరించాలని యోచిస్తున్నారు. జెన్-జీలో 43 శాతం, మిలీనియల్స్‌లో 47 శాతం మంది నీటి ఆదాకు పెద్దపీట వేస్తున్నారు. 36 శాతం జెన్-జీ, 37 శాతం మంది మిలీనియల్స్.. పర్యావరణ అనుకూల రవాణాకు మొగ్గు చూపుతున్నారు.
కెరీర్ ఎంపికలోనూ పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. జెన్-జీలో 23 శాతం మంది, మిలీనియల్స్‌లో 22 శాతం మంది.. ఉద్యోగాన్ని అంగీకరించే ముందు కంపెనీ పర్యావరణ రికార్డును పరిశోధించినట్లు చెప్పుకొచ్చారు. పర్యావరణ స్పృహతో వ్యవహరిస్తున్న ఇప్పటి తరం.. వినూత్న కార్యక్రమాలతో కార్పొరేట్ సంస్థలనూ దారిలోకి తెస్తున్నారని అధ్యయనకారులు చెబుతున్నారు. తమ నైపుణ్యాలు, ఆలోచనలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ.. ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడుతున్నారు.