మా బిడ్డ ఎందుకు అందరి పిల్లల్లాలేడు? ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? మామూలుగా ఎప్పుడు మారతాడు?.. ఇలాంటి ప్రశ్నలతో ఏళ్ల తరబడి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు ఎందరో! ఆటిజం బారినపడి.. బంగారు భవిష్యత్తును కోల్పోతున్న చిన్నారులు ఎందరో! అందుకే, ఆటిజాన్ని అంతం చేయాలని పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ జీపీటీ-ఓఎస్ (గ్లోబల్ పీడియాట్రిక్ థెరపీ ఆపరేటింగ్ సిస్టమ్) అనే సరికొత్త ఏఐ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ‘చైల్డ్ డెవలప్మెంట్ ఆపరేటింగ్ సిస్టమ్’గా పేరొందిన ఈ ఏఐ టూల్ ఎలా ఉపయోగపడుతుందో తెలియాలంటే.. మీకు ఓ చిన్నారి కథ తెలియాలి!!
హైదరాబాద్‌కు చెందిన ఆరేళ్ల ఆరవ్ (పేరు మార్చాం)కు అన్నీ అమ్మే! కానీ, ‘అమ్మా!!’ అని పిలవడు. అమ్మ కళ్లలోకి సూటిగా చూడలేడు. ఎన్నో అసెస్మెంట్లు.. థెరపీలు. అవన్నీదాటి ఆ అమ్మ అన్వేషణ పినాకిల్ గూటికి చేర్చింది. ఇక్కడ ఒక్క అసెస్మెంట్ తర్వాత ఆమెలో ఉన్న అయోమయం పోయింది. బిడ్డ ఎదుగుదలపై నమ్మకం పెరిగింది. రోజువారీ థెరపీలకు తోడుగా థెరప్యూటిక్ ఏఐ అండ దొరికింది. అప్పుడే ఆరవ్ జీవితంలోకి రంగులు తెచ్చే జీపీటీ-ఓఎస్ ముందుకొచ్చింది. ఆ బిడ్డ ప్రతి ఉదయం థెరపీ గదిలోకి అడుగుపెట్టగానే.. తన మానసిక స్థితిని రంగులు అర్థం చేసుకుంటాయి. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ గది లేత పసుపు రంగులో, ఏకాగ్రత పెరిగినప్పుడు నీలం రంగులోకి మారుతుంది. అతని మనసులో ఏమాత్రం అలజడి రేగినా.. ఆ గది ఎరుపెక్కుతుంది.
అలాంటి రెడ్ అలెర్ట్‌ని ఆ బిడ్డ జీవితంలోకి రాకుండా ‘పీపీటీ-ఓఎస్’ కెమెరా కంటితో నిత్యం పర్యవేక్షిస్తుంటుంది. ఆరవ్ శరీర కదలికలు, గొంతు, కళ్ల కదలికలను రికార్డ్ చేస్తుంది. ఆ డేటా ఆధారంగా, కేవలం కొన్ని క్షణాల్లోనే ఆరవ్ ‘రెడీనెస్ ఇండెక్స్’ను అప్డేట్ చేస్తుంది. ఆ ఇండెక్సే.. అతని ప్రొగ్రసివ్ గ్రోత్ రేట్. ఆ నంబర్.. ఆరవ్ తదుపరి అభివృద్ధి దశకు ఎంత దగ్గరగా ఉన్నాడో చూపిస్తుంది. ఆ తల్లికి ఈ నంబర్ కొత్త ఆశను, కొలవగలిగే భరోసాను ఇచ్చింది. యస్.. ఆరవ్ ఇక అందరి పిల్లల్లా స్కూల్ కి వెళ్తాడని.. జీవితం గురించిన కలలు కంటాడని ఆ తల్లి మురిసిపోతున్నది. ఎందుకంటే.. ప్రతి సాయంత్రం తన బిడ్డ ఎబిలిటీ స్కోర్ పెరుగుతున్నట్లు ఆరవ్ తల్లి డాష్‌బోర్డ్‌లో చూస్తున్నది.
అలాంటి బాధ నుంచి పుట్టింది!
జీపీటీ-ఓఎస్ ఆవిష్కర్తలు డాక్టర్ కోటిరెడ్డి సరిపల్లి, డాక్టర్ శ్రీజారెడ్డి సరిపల్లి దంపతులు. వీరికి కూడా వినికిడి లోపం ఉన్న బిడ్డే పుట్టాడు. అసలు సమస్యేంటో గుర్తించేందుకు ఏళ్లు పట్టందట. ఈ క్రమంలో ఆటిజంపై పరిశోధన చేశారు. తమలా మరే తల్లిదండ్రులు తల్లడిల్లకూడదని శ్రమించారు. పికాకిల్ బ్లూమ్స్ నెట్‌వర్క్‌తో దేశవిదేశాల థెరపీ సెంటర్లను స్థాపించారు. తమ థెరపీ విధానానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను జతచేస్తూ, దాన్ని మరింత ఆధునీకరించారు. ఇది పిల్లల పురోగతిని సాంకేతికత ఆధారంగా కొలిచి, ముందస్తుగా అంచనా వేసి.. ప్రతిరోజూ అనుసరించగల మార్గాన్ని చూపుతుంది. ‘టెక్నాలజీ చేయాల్సింది ఇదే. రేపటి రోజు బాగుంటుందని ప్రతి తల్లిదండ్రికీ నమ్మకాన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఆ నమ్మకాన్ని మనం కొలవగలుగుతున్నాం’ అని డాక్టర్ శ్రీజారెడ్డి చెబుతున్నారు.
అభివృద్ధిని ఎలా కొలుస్తారు?
సాధారణంగా ఆటిజం కేసుల్లో స్పష్టమైన పరీక్షలు (డయాగ్నస్టిక్స్) ఉండవు. కేవలం తల్లిదండ్రులతో మాట్లాడటం ద్వారా లోపాల తీవ్రతను అంచనా వేస్తారు. ఈ అసెస్మెంట్ ఆధారంగా ఎంత మేరకు మెరుగుపరచగలమనే దానికి నిర్ణీతమైన కొలత ఏదీ ఉండదు. అయితే, జీపీటీ-ఓఎస్ ఈ విధానాన్ని మార్చేసింది. ఇది బిడ్డ శరీరం చెప్పే మాటను వింటుంది. మెదడు, జ్ఞానేంద్రియాలు ఎలా స్పందిస్తున్నాయో ట్రాక్ చేస్తుంది.
మీరే మీ బిడ్డకు థెరపిస్ట్!
కేవలం థెరపిస్టుల దగ్గర చికిత్స తీసుకుంటున్నంత మాత్రాన చిన్నారి మెరుగుపడదు. వారు చెప్పిన దాన్ని ఇంట్లో అభ్యాసం చేయాలి. థెరపిస్టు దగ్గర ఉన్న పరిమిత సమయంలోనే ఆ అభ్యాసం కొనసాగితే సరిపోదు. అందుకే ఇప్పుడు ఏఐ ఆధారంగా మెరుగుపరచిన ఈ విధానాలలో తల్లిదండ్రుల పాత్ర చాలా పెరిగింది. తమ పిల్లలు మరింత మెరుగైన అభివృద్ధి సాధించడం కోసం ఇంట్లో చేయించాల్సిన అభ్యాసాలను థెరపిస్టులు వారికి వివరిస్తుంటారు. ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎంతగా అభ్యాసం చేయిస్తుంటే, చిన్నారుల్లో అభివృద్ధి అంతగా కనిపిస్తుంటుంది.
అలా ఇల్లే ఓ థెరపీ సెంటర్‌గా మారుతుంది. ఇది సాధ్యపడినప్పుడే తమ లక్ష్యం నెరవేరినట్టు అవుతుందనేది పినాకిల్ సంస్థ అధినేత కోటిరెడ్డి మాట. ‘ప్రస్తుతం మేము దాదాపు రెండు కోట్ల మంది చిన్నారులకు సాంత్వన కలిగించాం. మరో తొమ్మిది కోట్ల మంది పిల్లలను తమకు తాము పనులు చేసుకుంటూ, స్కూలుకు వెళ్లేలా సిద్ధం చేస్తున్నాం’ అని చెబుతున్నారు. ‘కొత్త సాంకేతికతకు దాదాపు 133 దేశాల్లో మేము పేటెంట్ పొందాం. దీన్ని కేవలం వాణిజ్యపరంగానే చూడటం లేదు. ఆర్థికంగా భరించలేని వారికి మా ‘ఆశ’ సంస్థ ద్వారా దాదాపుగా ఉచితంగా కూడా మా పరిజ్ఞానం అందేలా ఏర్పాట్లు చేస్తున్నాం’ అంటున్నారు.