Eating together | చిన్నోడు స్కూల్ నుంచి రాగానే తిని పడుకుంటాడు.. పెద్దోడు ఏ రాత్రికో ఇంటికొచ్చి తిన్నట్లు చేస్తాడు.. ఇక భార్యాభర్తలేమో ఒకరు టీవీ చూస్తుండగా.. మరొకరు మొబైల్లో బిజీగా ఉంటారు. ఇదీ మన వాళ్ల కుటుంబ వ్యవహారం తీరు. కుటుంబంలోని సభ్యులంతా కలిసి భోజనం చేయడం మన దగ్గర చాలా అరుదు. విదేశాల్లో అందరు కలిసి భోజనం చేసేందుకు టైమ్ కేటాయిస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వేక్ఫీల్డ్ చేపట్టిన అధ్యయనంలో తేలింది.
పండగకో, పర్వదినానికో, ఉత్సవానికో అంతా కలిసి తినడం మనం చూస్తుంటాం. తెల్లవారిందంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా కలిసి భోజనం చేయడం గురించి మరిచిపోతారు. అదే అమెరికా సహా అనేక దేశాల్లో డిన్నర్ థెరపీ అభ్యాసం పెరిగింది. ఈ డిన్నర్ థెరపీ కారణంగా కుటుంబసభ్యులు సంతోషంగా ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని తేలింది. ఫ్యామిలీ టెన్షన్ తగ్గించడానికి ఇదో సీక్రెట్ ఫార్ములా అని కూడా చెప్పుకుంటున్నారు. దాదాపు 91 శాతం మంది తల్లిదండ్రులు కుటుంబంతో కలిసి భోజనం చేయడం వలన ఒత్తిడి తగ్గుతుందని నమ్ముతున్నట్లు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడించింది.
హెల్తీ ఫర్ గుడ్ మూవ్మెంట్ కింద అమెరికాలోని 1,000 మంది పెద్ద వారిపై వేక్ఫీల్డ్ అధ్యయనకారులు సర్వే నిర్వహించారు. సగటున పెద్దలు దాదాపు సగం మంది ఒంటరిగా తింటారని తేల్చారు. ఇదే సమయంలో 84 శాతం మంది ప్రజలు తమ ప్రియమైన వారితో తినాలని కోరుకుంటున్నట్లు గుర్తించారు. కుటుంబంతో డిన్నర్ మిస్ అవడం వల్ల కొంత ఒత్తిడికి గురవుతున్నామని ప్రతి ముగ్గురిలో ఇద్దరు చెప్తుండగా.. 27 శాతం మంది అధిక ఒత్తిడి బాధితులమంటున్నారు.
నిరంతర ఒత్తిడి కారణంగా గుండె జబ్బులు, పక్షవాతం ముప్పు పెరుగుతుందని పరిశోధకులు చెప్తున్నారు. ఇతరులతో కలిసి తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు చెందిన ప్రొఫెసర్ ఎరిన్ మికోస్ చెప్పారు. ఇలా కుటుంబం అంతా కలిసి భోజనం చేయడం వల్ల ఆత్మగౌరవం కూడా పెరుగుతుందంటున్నారు. కుటుంబసభ్యులతోనే కాకుండా ఆఫీసులో తోటి ఉద్యోగులతో, స్నేహితులతో కలిసి భోజనం చేయడం వల్ల సామాజిక పరస్పర చర్యలు మెరుగుపడతాయంట. ఈటింగ్ టుగెదర్ అలవాట్లు మనం పొరుగువారితో కనెక్ట్ అవడం ప్రాముఖ్యతను చూపుతుందని అధ్యయనకారులు సెలవిస్తున్నారు.