Loneliness | ఒంటరితనానికి ఎప్పుడు గురవుతారు? ఎందుకు గురవుతారు? తమలో తామే ఎందుకు మథన పడతారు? ఫలానా వ్యక్తిని ఒంటరితనం బాధిస్తున్నట్టు గుర్తించడం ఎలా? దీనిపై సుదీర్ఘ అధ్యయనం చేశారు బర్మింగ్‌హామ్‌కు చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ డా.లలితా సుగ్లానీ. ఆ పరిశోధన సారాంశం..
ఉరుకుల పరుగుల ప్రపంచంలో మనిషి తన జీవితాన్ని తాను జీవిస్తున్నాననే భ్రమలో.. తోటివారిని పట్టించుకోవడం మానేశాడు. తోబుట్టువులు, భార్యాపిల్లలు, తల్లిదండ్రులు కావొచ్చు. స్నేహితుడో, తోటి ఉద్యోగో కావొచ్చు. మనిషిని మనిషి పట్టించుకోకపోవడం వల్లే అంతర్ముఖుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది అంటున్నారు డా.సుగ్లానీ. యాంగ్జయిటీ మేనేజ్మెంట్, ఓవర్‌కమింగ్ ఫియర్, ఇంపోస్టర్ సిండ్రోమ్ వంటి అంశాల మీద సుగ్లానీ లోతైన అధ్యయనం చేశారు. ఈ పరిశీలనలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్న వారిలో తరచూ కనిపించే 12 లక్షణాలు వెల్లడించారు. ఈ లక్షణాలున్నాయా..
1. ఆప్తులకు దూరంగా ఉండటం.
2. నిత్యం అలసిపోయినట్టుగా అనిపించడం.
3. ఏదో కోల్పోయినట్టుగా దిగాలు పడటం.
4. ఎక్కువసేపు స్నానం చేయడం.
5. వినోదాలకు దూరంగా ఉండటం.
6. ఎవరో లాక్ చేసినట్టు గదికి గొళ్లెం పెట్టుకుని కాలక్షేపం చేయడం.
7. సోషల్ మీడియా యాప్స్‌లో ఎక్కువ కాలక్షేపం.
8. ప్రతిదాన్నీ భారంగా తీసుకోవడం.
9. విశ్రాంతి దొరకడం లేదని భావించడం.
10.తనను తానే అనుమానించడం.
11. మొండిగా ప్రవర్తించడం.
12. రోజువారీ అలవాట్లు మార్చుకోవడం.
డా. లలితా సుగ్లానీ చెప్పిన పై 12 లక్షణాలను మీ ఆప్తుల్లో, కుటుంబసభ్యుల్లో, స్నేహితుల్లో కనిపిస్తే వారు ఒంటరితనానికి గురవుతున్నారని.. తమకు ఎవరూ లేరని ఫీలవుతున్నారని అర్థం. వారికోసం కొంత సమయం వెచ్చించండి. నెగెటివ్ ఆలోచనల్లోంచి బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించండి. మరొక్కమాట.. కొన్నిసార్లు ఒంటరితనం అనివార్యం కావొచ్చు. దాన్నొక అదృష్టంగా భావించండి. ఏకాంత సమయంగా తీర్చిదిద్దుకోండి. మీకు నచ్చినట్టుగా.. మీరు మెచ్చినట్టుగా ఆస్వాదించండి.
☞ ఎంతమంది ఆత్మీయులు ఉన్నా కొన్నిసార్లు మనిషి ఒంటరితనానికి గురవుతాడు. అలా అనిపించినప్పుడు సుదూర ప్రయాణం చేయండి. ఇష్టమైన సినిమా చూడండి. నచ్చిన ఫుడ్ కడుపు నిండా తినండి.
☞ శరీరంలోని సెరటోనిన్ అనే హార్మోన్ తక్కువైతే ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. దీనికి అడ్డుకట్ట వేయాలంటే అరటిపండు, గుమ్మడికాయ గింజలు, డార్క్ చాక్లెట్లు, మిల్లెట్స్ వంటివి డైట్లోచేర్చుకోవాలి.
☞ మనిషికి సరిపడా నిద్ర, విశ్రాంతి అవసరం. ఈ రెండూ లేకపోతే నెగెటివ్ ఆలోచనలు వస్తాయి. చిన్నచిన్న వాటికే కోపం వచ్చేస్తుంది. అరిచేస్తారు. అందరికీ దూరంగా ఉండాలనుకుంటారు. ఒంటరితనపు ఊబిలో చిక్కుకుపోతారు. అందుకే బాగా నిద్రపోవాలి. శరీరం అలసిపోయినట్టు అనిపిస్తే కాసేపు విశ్రాంతి తీసుకోవాలి.
☞ ఒంటరితనం మరీ ఎక్కువకాలం మంచిది కాదు. దీనివల్ల బీపీ, గుండెపోటు, ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు వస్తాయి. బాధ అనేది అతి సహజం. వీలైనంత త్వరగా దాన్ని మరిచిపోవాలి. ఏదైనా ఆహార పదార్థం రుచిగా లేకపోతే దాన్ని తినకుండా ఎలా వదిలేస్తామో.. బాధను కూడా అంతే. ఎక్కువసేపు ఉంచుకోవద్దు.. వదిలేయాలి.
☞ చాలామంది ఒంటరిగా ఉండటం ఒక రకమైన శిక్షగా ఫీలవుతుంటారు. నిజానికి ఒంటరితనం శిక్ష కాదు. ఒంటరిగా ఉన్నప్పుడు మన శక్తి ఏంటో మనకు తెలుస్తుంది.
ఒంటరితనం ఓ వరం.. ఒంటరితనం ఓ అదృష్టం.. నీతో నువ్వు మాట్లాడుకోవడానికి.. చేదు జ్ఞాపకాలు మరిచిపోవడానికి.. భవిష్యత్తును నిర్మించుకోవడానికి.. నీ చుట్టూ ఉన్న సమాజం నీకిచ్చిన అత్యంత విలువైన బహుమతి. ఆ కానుకను నీ వికాసానికి వాడుకో..