Banana Peel | అరటి పండును తినగానే సహజంగానే చాలా మంది తొక్కలను పడేస్తుంటారు. అరటి పండును తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే కేవలం పండు మాత్రమే కాదు, దాని తొక్క కూడా మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అరటి పండు తొక్కతో ఆరోగ్యపరంగా మనకు అనేక లాభాలు కలుగుతాయి. కనుక ఇకపై అరటి పండు తొక్కను పడేయకండి. అరటి పండు తొక్క వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి పండు తొక్కలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్, ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫాస్ఫరస్, ఐరన్, క్యాల్షియం, మెగ్నిషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అరటిపండు తొక్కను ఉపయోగించి ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని వాడవచ్చు. దీంతో ముఖానికి తేమ లభిస్తుంది. ముఖం అందంగా మారుతుంది. మృదువుగా ఉంటుంది. అరటి పండు తొక్కను నేరుగా ముఖానికి రుద్దవచ్చు కూడా. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. అలాగే దురద, ఎరుపుదనం నుంచి ఉపశమనం లభిస్తుంది.
అరటి పండు తొక్కలో టానిన్స్, ఫైటో న్యూట్రియెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అరటి పండు తొక్కలను ముఖంపై రుద్దడం వల్ల వాటిల్లో ఉండే ఫైటో కెమికల్స్ ఫ్రీ ర్యాడికల్స్ వల్ల చర్మానికి కలిగే నష్టం నుంచి రక్షిస్తాయి. ముఖ్యంగా అరటిపండు తొక్కలో ఉండే పాలిఫినాల్స్, కెరోటినాయిడ్స్ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. దీంతో చర్మం ఎల్లప్పుడూ కాంతివంతంగా కనిపిస్తుంది.
అరటి పండు తొక్కలో యాంటీ ఇన్ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల అరటి పండు తొక్కను చర్మంపై రుద్దితే సోరియాసిస్, ఎగ్జిమా వంటి చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పురుగులు కుట్టిన చోట, గాయాలు అయిన చోట, ఎండ వల్ల చర్మం కందిన చోట అరటి పండు తొక్కను రుద్దితే ఉపశమనం లభిస్తుంది. బాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఉన్న చోట అరటి పండు తొక్కను రుద్దడం వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి.
Banana Peel
అరటి పండు తొక్కను హెయిర్ ప్యాక్ లా కూడా ఉపయోగించవచ్చు. దీంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. కాంతివంతంగా మారుతాయి. అరటి పండు తొక్కను జుట్టుకు నేరుగా రుద్దవచ్చు. తరువాత 15 నుంచి 30 నిమిషాలు ఆగి తలస్నానం చేయాలి. దీంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇక అరటి పండు తొక్కలను దంతాలపై రుద్దడం వల్ల దంతాలపై ఉండే పాచి, గార పోతాయి. నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
అరటి పండు తొక్కను ఫ్రిజ్లో కాసేపు ఉంచి అనంతరం దాన్ని నుదుటిపై పట్టీలా వేయాలి. దీంతో తలనొప్పి తగ్గిపోతుంది. అదేవిధంగా అరటి పండు తొక్కలను సేంద్రీయ ఎరువులా వాడవచ్చు. దీంతో మీ ఇంట్లోని, పెరట్లోని మొక్కలు చక్కగా పెరుగుతాయి. పువ్వులు పూస్తాయి. ఇలా అరటి పండు తొక్కలను ఉపయోగించి ఎన్నో లాభాలను పొందవచ్చు.