ఇల్లు తగలబడి ఒకడేడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నాడట మరొకడు! మేటి వార్తలు ప్రసారం చేసే పోటుగాళ్లమని ప్రకటించుకునే ఎలక్ట్రానిక్, యూట్యూబ్ న్యూస్ చానల్స్ తీరు అచ్చంగా ఇలాగే ఉంటున్నది. మసకబారుతున్న మానవీయ విలువలే టీఆర్పీ రేటింగ్స్‌కు నిచ్చెనలుగా భావిస్తున్నారు. వివాహేతర సంబంధాలకు చెందిన కథనం దొరికిందా కొందరు వార్తాహరులు కదం తొక్కుతున్నారు. నక్క తోక తొక్కినంతగా సంబరపడిపోతున్నారు. తూర్పు దిక్కున సుక్క పొడవకముందే.. సదరు బాధితుడి పెద్దింటి ముందు రెండు ఓబీ వ్యాన్లు రెడీగా ఉంచుతున్నారు. ఒకవేళ అతగాడో, ఆవిడో అక్కడ మిస్ అయితే.. చిన్నింటి ముందు ఈసారి మూడు ఓబీ వ్యాన్లు సిద్ధంగా ఉంచేస్తున్నారు. మరోవైపు డెస్కుల్లో న్యూస్ సారీ వ్యూస్ క్రియేటర్లు కసరత్తులు చేస్తూనే ఉంటారు.
కంటెంట్ రాకముందే ప్రోమోలు సిద్ధంగా ఉంచేస్తారు. ఆ అక్రమ సంబంధాన్ని నిలువరించడమే తమ ధ్యేయమన్నట్టుగా అసంబద్ధ వ్యాఖ్యలు స్క్రోలింగ్ అవుతుంటాయి. ఇదంతా బాధితులు కెమెరా కంటికి చిక్కకముందే జరిగే తతంగం. ఇంకోవైపు ఫీల్డులో ఉన్న రిపోర్టర్‌ను రెడ్ అలెర్ట్ చేస్తుంటారు పైవాళ్లు. మొదటి గ్లాసు మన టీవీలో బ్రేక్ అవ్వాలంటూ హెచ్చరికలు జారీ చేస్తుంటారు. పొరపాటున సదరు వివాహేతర సంబంధానికి పాల్పడిన లేదా గురైన వ్యక్తి గడప దాటారో.. మేకుల్లాంటి మైకులు వారి ముఖాల మీదికి పొడుచుకొస్తాయి. లైవ్ టెలికాస్ట్ మొదలవుతుంది.
ఇక ప్రశ్నల పరంపరకు అంతే ఉండదు. ఒక్క సహేతుకమైన ప్రశ్నా అడగరు. పచ్చి క్వశ్చన్లు పచ్చిగా పుట్టుకొస్తాయి. అవతలి వ్యక్తి సమాధానాలు చెప్పలేక సతమతమైతే ‘జూమ్ చెయ్’ అని కెమెరామ్యాన్‌కు సూచిస్తారు. అప్పటికే జూమ్ చేసి వినోదం అనుభవిస్తున్న కెమెరామ్యాన్ ‘ఆల్రెడీ డిడ్’ అన్నట్టుగా గర్వంగా పోజిస్తాడు. ‘ఉండాల్సినోడివోయ్..’ అని మైకుబాబు మరింత ఉత్సుకత ప్రదర్శిస్తాడు. విలువల్లేకుండా వ్యవహరించడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో ఇంట్లోకి చొరబడి.. పడగ్గదిలోకి కూడా తొంగి చూసి.. పైశాచిక ఆనందాన్ని ప్రత్యక్ష ప్రసారం గావిస్తుంటాడు.
రెండు కుటుంబాల మధ్య, ముగ్గురు వ్యక్తుల నడుమ పరిష్కారం కావాల్సిన సమస్యను ఆ పూటకు ఆడుకుంటారంతా! సెలెబ్రిటీలు మాత్రమే కాదు.. సామాన్య ప్రజలనూ వీళ్లు వదిలిపెట్టరు. ఇటీవల ఇలాంటి ఇష్యూలు ఎన్నో… యూట్యూబ్, వార్తా చానల్స్‌లో సంచలనం సృష్టించిన సంగతి మనకు ఎరుకే! కానీ, ఈ మొత్తం ఎపిసోడ్… తప్పు చేసినవాళ్లు దాన్ని దిద్దుకునే పరిస్థితి లేకుండా చేస్తుంది. మరింతమంది అదే తప్పు చేసేలా ప్రేరేపిస్తుంది అనడంలో నో డౌట్!!
– కోబ్రా