బంగారం తర్వాత ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే లోహం వెండి. ఈ తరం అతివల నగల కలెక్షన్లో బంగారం మెరుపుల కన్నా వెండి తళుకులే ఎక్కువగా కనిపిస్తాయి. ఆ మెరుపుల్ని, ఈ తళుకుల్ని కలగలిపి మిక్స్డ్ జువెలరీగా అందుబాటులోకి తెస్తున్నారు డిజైనర్లు. స్వర్ణ వర్ణానికి రజతం జతకూడి నగ నిగలకు కొత్త సరిగమలు నేర్పుతున్నాయి.
అతివల అందాన్ని ఇనుమడించే వాటిలో ఆభరణాలది మొదటి స్థానం. వాటి తయారీలో తొలి ప్రాధాన్యం బంగారానికే. పుట్టినరోజు, పెండ్లిరోజు, బారసాల, సీమంతం, పండుగలు.. ఇలా శుభకార్యం ఏదైనా అతివల అలంకరణలో ఆభరణాలు తప్పకుండా ఉండాల్సిందే. ప్రేమికులు, భార్యాభర్తలు, బంధువులు సందర్భానికి అనుగుణంగా బహుమతులుగా ఇచ్చిపుచ్చుకునేందుకు కూడా బంగారు ఆభరణాలకే ప్రాధాన్యం ఇస్తారు. అయితే, ఆధునిక కాలంలో ఎప్పటికప్పుడు ట్రెండ్ మారిపోతూనే ఉంటుంది. అందుకు తగినట్లు రోజురోజుకూ రకరకాల డిజైనర్ నగలు మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. మోడ్రన్ దుస్తుల మీదకు నప్పే జువెలరీకి అతివలు ఓటేస్తున్నారు. వారి అభిరుచిని దృష్టిలో ఉంచుకొని రూపొందించినవే మిక్స్డ్ జువెలరీ.
బంగారం, వెండి కలిపి తయారుచేస్తున్న నగలు బడ్జెట్లోనే హంగామా చేస్తున్నాయి. రకరకాల డిజైన్లు అందుబాటులో ఉండటంతో రోజురోజుకూ వీటికి డిమాండ్ పెరుగుతున్నది. గొలుసులు, బ్రేస్లెట్స్, ఉంగరాలు, కంఠాభరణాలు, గాజులు, కమ్మలు, పట్టీలు, మెట్టెలు.. ఇలా ఒక్కటేమిటి ఆపాద మస్తకం ఇంతులు అలంకరించుకునే వింత ఆభరణాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. బంగారం, వెండి కాంబినేషనే కాకుండా మరింత మెరుపు కోసం ప్లాటినమ్, బంగారం కలిపి కూడా ఈ నగలను తయారుచేస్తున్నారు. ఇలా బంగారం, వెండి, ప్లాటినమ్ వంటి ఖరీదైన లోహాలతోనే చేసినవాటితో పాటు ఇమిటేషన్ జువెలరీ, వన్ గ్రామ్ గోల్డ్ జువెలరీలోనూ ఈ మిక్స్డ్ ఫార్ములా ప్రవేశపెట్టి.. ఫ్యాషన్ ప్రియులను టార్గెట్ చేస్తున్నారు తయారీదారులు. ఈ జంటలోహాల నగలు ఆన్లైన్ అంగట్లో ఇబ్బడిముబ్బడిగా లభ్యమవుతున్నాయి.