చిరిగిందైనా సరే జీన్సు ఫ్యాషనే. ఇక, ఇప్పుడు కాస్త పాతబడ్డా ఫ్యాషన్ ఐకానే అంటున్నారు నయా డిజైనర్లు. జీన్స్‌ను పునర్వినియోగించి ట్రెండీ నగలను రూపొందిస్తున్నారు. అప్సైకిల్డ్, రీసైకిల్డ్ డెనిమ్ జువెలరీ పేరిట వస్తున్న ఇవి కాలేజీ పిల్లల్ని కట్టిపడేస్తున్నాయి. జీన్స్‌తో ఏం చేసినా మాకు నచ్చేస్తుందంతే… అనేలా కనికట్టు చేస్తున్నాయి.
నగలంటే బంగారు నగలే అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. గిల్టు సొమ్ములైనా స్వర్ణాన్ని పోలినవే పెట్టుకోవాలనే నిబంధనా లేదు. మనసుకు నచ్చాలి, డ్రెస్సుకు నప్పాలి.. బస్.. ఇంకేం అక్కర్లేదు. ‘అలా ఏమన్నా ఉంటే చూపించండి బ్రో.. మాకు మరీ వెతికేందుకు టైం లేదు’.. అనేస్తున్నారు ఇప్పటి అమ్మాయిలు. అచ్చం అవే ఫీచర్లతో తయారవుతున్నాయి అందమైన డెనిమ్ నగలు. జీన్స్‌లోని ఫ్యాషన్ లుక్, ఆభరణాల్లోని నాజూకు సోకు… రెండూ ఇందులో ఉన్నాయి. మనం వాడిపడేసిన జీన్స్ చెత్త కుప్పల్లో పేరుకుపోకుండా.. కళాత్మకంగా కత్తిరించి అందాల నగలు తయారు చేస్తున్నారు. అంతేకాదు, ఫ్యాక్టరీ కటింగుల్లో మిగిలి పోయిన వస్ర్తాలనూ ఉపయోగిస్తున్నారు.
కావాలనుకున్న నగను బట్టి జీన్స్‌ను కత్తిరించి అద్దాలు, పూసలు, రాళ్లు జోడిస్తున్నారు. అలా డెనిమ్ నగల్లో నెక్లెస్‌లు, గొలుసులు, చెవిపోగులు, బ్రేస్లెట్లు.. ఇలా బోలెడు రకాలు రూపొందిస్తున్నారు. అంతేకాదు గవ్వలు పేర్చి, కుందన్లు అమర్చి, అచ్చంగా డెనిమ్ వస్త్రంతోనే పువ్వుల్ని తీర్చిదిద్ది.. ఎన్నో మోడళ్లను తీసుకొస్తున్నారు. ఫ్యాషన్ దుస్తుల మీదికి ఇవి బాగుంటాయి. అందం విషయంలో రాజీలేకుండా, మాజీ జీన్స్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ ఆభరణాలను చూసిన ఎవరైనా వాహ్ జీ… అనాల్సిందే! పార్టీకో, ఫంక్షన్‌కో సింగారించుకుని వెళ్లాల్సిందే.