మనం అనేక ఒత్తిళ్లతో కూడిన ప్రపంచంలో జీవిస్తున్నాం. పనుల్లో డెడ్లైన్లు మొదలుకుని వివిధ ఆరోగ్య సమస్యల వరకు రోజువారీగా ఎన్నో అంశాలు మనిషి మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఆహారపు అలవాట్లను మార్చుకుంటే ఒత్తిడి, కుంగుబాటు సమస్యలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏదో ఒక చిరుతిండి తినేకంటే శరీరానికి మంచి పోషణనిచ్చే ఆహారం ఎంచుకోవాలి. ఈ క్రమంలో ఒత్తిడిని హుష్‌కాకి చేయడానికి ఆహారంలో చేర్చుకోవాల్సిన కొన్ని పదార్థాల గురించి తెలుసుకుందాం.
బాదం, వాల్నట్స్, అవిసెలు, గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, ఒమేగా- 3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి అండగా నిలుస్తాయి. ఆందోళన లక్షణాల నుంచి ఉపశమనం ఇస్తాయి. చారెడన్ని గింజలు క్యాలరీల బాధ లేకుండానే మనకు ఎంతో శక్తిని, సంతృప్తిని అందిస్తాయి.
డార్క్ చాక్లెట్ (70 శాతానికి పైగా)లో యాంటి ఆక్సిడెంట్లు, మెగ్నీషియం పుష్కలం. అలా ఇది శరీరంలో హ్యాపీ హార్మోన్ అయిన సెరటోనిన్ విడుదలను ప్రేరేపిస్తుంది. కాబట్టి, మీ మూడ్‌ను మెరుగుపర్చుకోవడానికి డార్క్ చాక్లెట్‌ను అప్పుడప్పుడు తినడం మంచిదే.
గ్రీక్ యోగర్ట్‌లో ప్రొటీన్లు, ప్రొబయోటిక్స్ ఉంటాయి. ఇవి పొట్టకు ఆరోగ్యం చేకూరుస్తాయి. మానసిక ఆరోగ్యానికి సహకరిస్తాయి. బెర్రీల్లో యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసోల్ స్థాయులను క్రమబద్ధం చేస్తాయి. జీర్ణక్రియకు సహకరిస్తాయి.
చమోమైల్ (ఒకరకం చేమంతి), లావెండర్, తులసి టీలు ఆందోళనను అమాంతం పోగొడతాయి. మంచి నిద్ర పట్టేలా చేస్తాయి.
హోల్గ్రెయిన్స్లో ఉండే కార్బొహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. తృణధాన్యాలతో చేసిన కరకరలాడే స్నాక్స్ తినడం ఒత్తిడిని పారగొడుతుంది. రుచికోసం వీటికి ప్రొటీన్లు ఎక్కువగా ఉండే హమ్మస్ (శనగలతో చేసిన చట్నీలాంటిది), పీనట్ బటర్ చేర్చుకోవాలి.
అరటిపండ్లలో విటమిన్ బి6, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రెండూ కూడా నాడీ వ్యవస్థ సవ్యంగా పనిచేయడానికి దోహదపడతాయి. అరటిపండు ముక్కలకు కొంచెం దాల్చినచెక్క పొడి చేరిస్తే రుచి పెరుగుతుంది. దాల్చినచెక్క రక్తంలో చక్కెర స్థాయులను క్రమబద్ధం చేయడంలో సహాయకారిగా ఉంటుంది.