తమకు కావాల్సినవన్నీ అందించే తల్లిదండ్రులకు పిల్లలు ఎప్పుడూ రుణపడి ఉంటారు. కానీ, ఈ విషయంలో మాత్రం.. తల్లిదండ్రులే పిల్లలకు కృతజ్ఞతలు చెప్పాలని అంటున్నారు కొందరు మానసిక పరిశోధకులు. అమెరికాకు చెందిన ‘రట్జర్స్ హెల్త్ అండ్ యేల్ విశ్వవిద్యాలయం’ పరిశోధకులు.. తాజాగా తల్లిదండ్రుల మెదడు పనితీరుపై ఒక అధ్యయనం నిర్వహించారు. తల్లిదండ్రులుగా ఉండటం.. వృద్ధాప్యం వల్ల మెదడుపై కలిగే కొన్ని సహజ ప్రభావాలను నివారించగలదని కనుగొన్నారు. ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేచురల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’లో ప్రచురితమైన ఈ అధ్యయనం.. అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
అంతేకాదు.. పిల్లలు ఎక్కువైన కొద్దీ.. ఈ ప్రభావాలు బలపడతాయని కూడా అధ్యయనం కనుగొన్నది. దాదాపు 37,000 మంది పెద్దలను అధ్యయనం చేసిన తర్వాత.. శాస్త్రవేత్తలు ఈ నిర్ణయానికి వచ్చారు. పరిశోధనలో భాగంగా వీరి మెదళ్లను పరిశోధకులు స్కాన్ చేసి, వాటిని వివిధ రకాలుగా విశ్లేషించారు. మెదడులో కదలికలు, సామాజిక ప్రవర్తనతో సంబంధం ఉన్న మెదడు ప్రాంతాలపై దృష్టిపెట్టారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మెదడు నెట్వర్క్లలో, ముఖ్యంగా ఇంద్రియ విధులకు బాధ్యత వహించే వాటిలో బలమైన క్రియాత్మక కనెక్టివిటీని కలిగి ఉన్నదని కనుగొన్నారు. ఈ ప్రాంతాలు సాధారణంగా వయసుతోపాటు బలహీనపడతాయి. కానీ, ఎక్కువమంది పిల్లలు ఉన్నవారిలో ఇవి బలంగానే ఉన్నట్టు వారు వెల్లడించారు. అంటే.. ఎంత ఎక్కువమంది పిల్లలుంటే.. ఆ తల్లిదండ్రుల మెదడు వయసు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.