2016.. భారత వైమానిక దళ చరిత్రలో ఓ కొత్త అధ్యాయం. తొలిసారిగా మహిళలకు ఈ దళంలోని ఫైటర్ స్ట్రీమ్‌లోకి ప్రవేశం లభించింది. అంటే గగన తలంలో శత్రువులతో నేరుగా పోరాడేందుకు ఆడవాళ్లు కూడా అర్హత సాధించారు. తొలి బ్యాచ్‌లో ముగ్గురు మహిళా ఫైటర్లున్నారు. భావనా కాంత్, అవనీ చతుర్వేది, మోహనా సింగ్‌లు అత్యంత కఠినమైన యుద్ధ విమాన శిక్షణను పూర్తి చేసుకున్న తొలి మహిళా ఫైటర్ పైలట్లుగా చరిత్రలో నిలిచారు. హైదరాబాద్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ (దుండిగల్)లో శిక్షణతో ఈ ప్రయాణం మొదలైంది. అప్పుడే భావనా కాంత్ ధీర వనితగా దేశానికి తొలిసారి పరిచయం అయ్యారు. అయితే అది ఆమె తొలి అడుగు మాత్రమే. ప్రతిసారీ సవాలుతో కూడుకున్న ఒక్కో పనినీ పూర్తి చేస్తూ ఒక్కో మెట్టూ ఎదిగారామె. దశాబ్ద కాలంలో మరో మైలురాయిని చేరుకున్నారు. 2026 ఆగస్టులో ఆమె గ్వాలియర్‌లోని భారత ప్రఖ్యాత ఎయిర్ ఫోర్స్ సంస్థ ద్వారా ‘టాప్ గన్’ స్థాయి ఆఫీసర్‌గా ఎంపికైన తొలి మహిళగా రికార్డు సృష్టించారు.
చిన్న నాటి కల..
భావనా కాంత్ స్వస్థలం బీహార్‌లోని దర్భంగా జిల్లా బౌర్ గ్రామం. ఆమె తండ్రి తేజ్ నారాయణ్ కాంత్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పనిచేశారు. తల్లి రాధాకాంత్ గృహిణి. భావనకు ఆకాశంలో ఎగిరే విమానాలంటే చిన్నప్పటి నుంచే ఆసక్తి. ‘నేను పైలట్ కావాలి’ అన్న కోరికను చిన్న వయసులోనే తండ్రితో పంచుకునేవారు. అయితే అప్పట్లో అమ్మాయిలకు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రవేశం లేకపోవడంతో అందులో చేరాలన్న ఆమె కోరిక నెరవేరలేదు. కానీ, ఆమె ఆడపిల్ల కాబట్టి ఆ కలను వదిలేయాలని తను కానీ, తల్లిదండ్రులు కానీ భావించలేదు. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలూ ఏదైనా సాధించగలరు అన్న నమ్మకంతో ఆమెను ప్రోత్సహిస్తూ వచ్చారు. భావన చదువులో ముందుండటంతోపాటు ఈత, బ్యాడ్మింటన్, వాలీబాల్ సహా సాహస క్రీడల్లోనూ రాణించేది. బెంగళూరు నుంచి మెడికల్ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. తర్వాత కూడా వైమానిక దళంలో చేరే తన ఆసక్తిని వదలకుండా అవకాశం ఉన్నప్పుడల్లా దరఖాస్తు చేసుకుంటూ అందులో శిక్షణకు ఎంపికైంది.

Bhavana Kanth 2
తొలి సోలో విహంగం
ఫైటర్ పైలట్‌గా మారడం ఒక కల అయితే.. యుద్ధ విమానాన్ని ఒంటరిగా నడపడం మరో కీలక పరీక్ష. శిక్షణ పూర్తయిన తర్వాత 2018 మార్చిలో భావనా కాంత్ మిగ్-21 బైసన్‌పై తొలి సోలో విమానయానం చేశారు. రష్యన్ మూలాలున్న ఈ విమానాన్ని ఒంటరిగా నడపడం ఆమె ప్రయాణంలో కీలకమైన పరీక్ష. అందులో ఆమె దాదాపు అరగంట సేపు ప్రయాణించారు. నేలపై నిలిచిన వేల కళ్ల మధ్య నుంచి ఆకాశంలోకి దూసుకెళ్లిన ఆ విమానం.. భారత మహిళల సామర్థ్యానికి మరో కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. 2019లో భావన మరో చరిత్రాత్మక ఘనత సాధించారు. మిగ్-21 బైసన్‌పై పగటి వేళల్లో యుద్ధ కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి, యుద్ధ మిషన్లకు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా ఫైటర్ పైలట్‌గా నిలిచారు. అనంతరం సుఖోయ్-30 ఎంకేఐ వంటి అత్యాధునిక యుద్ధ విమానాలపై కూడా తన నైపుణ్యాన్ని కొనసాగించారు.
భారత మహిళలకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక నారీ శక్తి పురస్కారాన్ని 2020వ సంవత్సరంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. గణతంత్ర వేడుకల్లో గర్వంగా..దేశం మొత్తం ఆసక్తిగా తిలకించే గణతంత్ర వేడుక వేదికపైనా భావన తనదైన ముద్ర వేశారు. 2021 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో భారత వైమానిక దళ శకటంలో పాల్గొన్న తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా మరో ఘనత సాధించారు.
చిన్నతనంలో టీవీలో చూసిన గణతంత్ర వేడుకల్లో ఒకరోజు తానే యూనిఫాంలో భాగమవుతానని ఊహించిన ఆ కల.. నిజమైంది. 2024లో గణతంత్ర దినోత్సవ వైమానిక విన్యాసాల్లోనూ ఆమె భాగమయ్యారు.
కాంబాట్ లీడర్‌గా మరో చరిత్ర
భావన ప్రయాణంలో మరో కీలక అధ్యాయం 2026లో నమోదైంది. గ్వాలియర్‌లోని టాక్టిక్స్ అండ్ ఎయిర్ కాంబాట్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో నిర్వహించే ప్రతిష్ఠాత్మక ఫైటర్ కాంబాట్ లీడర్ కోర్సును పూర్తి చేసిన తొలి మహిళా ఐఏఎఫ్ అధికారిగా ఆమె నిలిచారు. 20 వారాల పాటు ఎంతో కఠినంగా సాగే ఈ శిక్షణ… అత్యాధునిక యుద్ధ విమానాల్లో వెళుతూ పాటించాల్సిన యుద్ధ వ్యూహాలు, అత్యంత క్లిష్టమైన వైమానిక పోరాట పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవడం, వ్యూహాలను అమలు చేయడం వంటి ఉన్నత స్థాయి నైపుణ్యాలకు మరింత పదును పెడుతుంది. తొలి వరుసలో పనిచేస్తున్న వైమానిక దళ సైనికులకు కూడా వీళ్లు సారథ్యం వహిస్తారు. అలా కఠోరమైన శ్రమ, నిబద్ధతతో తన కలను నిజం చేసుకున్న భావన ఎందరో ఆడపిల్లల కలలకు దిక్సూచి!