భరతమాత ముద్దుబిడ్డలు మన సైనికులు. ఆ వీరమల్లులకు జన్మనిచ్చిన తల్లులే అసలైన ముద్దుబిడ్డలు. మన దేశ రక్షణ కోసం.. కన్నప్రేమను పణంగా పెట్టిన వీరమాతలు వీళ్లు. ఇప్పుడు ఆ మాతృమూర్తుల గుండెల్లో సాగుతున్న సమరం… సరిహద్దుల్లో యుద్ధానికేం తీసిపోదు. నవ మాసాలు తన గర్భాలయంలో నిశ్చింతగా ఉన్న బిడ్డ.. పొత్తిళ్లలో తొలిసారి కన్ను తెరిచిన బిడ్డ.. క్షణకాలం పాలు ఇవ్వడం ఆలస్యమైతే గుక్కపట్టి ఏడ్చిన బిడ్డ.. ఇప్పుడు ఎలా ఉన్నాడో.. ఏ దిక్కు నుంచి ఏ ఆపద ముంచుకొస్తుందో.. అని ప్రతిక్షణం కకావికలం అవుతుందా తల్లి. ‘బెంగ పడకమ్మా! మై జరూర్ వాపస్ ఆవూఁగా’ అంటూ యుద్ధానికేగుతూ తన బిడ్డ ఇచ్చిన మాటనే నమ్ముకొని.. నిరీక్షిస్తుంటుంది. తల్లడిల్లుతున్న ఆ తల్లి మనసు కుదుటపడటమే అసలైన మాతృదినోత్సవం.
కాన్పు… జీవన్మరణ సమరం!
ఆ యుద్ధాన్ని దిగ్విజయంగా
పూర్తి చేసుకుని అమ్మగా గెలుస్తుంది.
అడ్డాల బిడ్డను కంటికి రెప్పలా
కాపాడుకుంటూ మరో సమరం సాగిస్తుంది.
లాలించి ఒకసారి, బెదిరించి ఇంకోసారి
అమ్మే గెలుస్తుంది.
తన బిడ్డను ప్రయోజకుణ్ని చేసే వరకు
అమ్మ పోరాడుతూనే ఉంటుంది.
బిడ్డ తన సొంతకాళ్లపై నిలబడి, ఆదర్శంగా జీవనం సాగించేదాకా అమ్మ బతుకు
నిత్య సంగ్రామమే!
ఇది అందరి విషయంలో జరిగేదే! కానీ, వీర సైనికులను దేశానికి అందించిన వీరమాతల పోరాటం మాటేమిటి? సరిహద్దుల్లో సైరన్ మోగిన ప్రతిసారీ.. అమ్మ గుండె వేగం పెరుగుతుంది. అధికారుల నుంచి పిలుపు వచ్చినప్పుడల్లా.. హైరానా పడిపోతుంది. క్షేమంగా వెళ్లిన బిడ్డ.. ప్రాణాలతో వస్తే చాలని ముక్కోటి దేవుళ్లనూ ప్రార్థిస్తుంది.
విచక్షణ లేని శత్రుదేశం దొంగ యుద్ధానికి పాల్పడుతుంటే.. తన బిడ్డ పద్మవ్యూహంలో చిక్కుకున్నాడా అని సందేహిస్తుంది తల్లి. ఫోన్ మోగితే చాలు.. తన పక్కనే మిసైల్ పడినంతగా ఇదైపోతుంది. కానీ, ఆ అమ్మ ఉగ్గుపాలతో నూరిపోసిన ధైర్యం అక్కడ సైనికులకు రక్షణ కవచం. బువ్వ పెడుతూ ఆమె చెప్పిన వీరగాథలే వాళ్లకు శక్తి. అన్నిటినీ మించి.. అమ్మ చూపిన ఆప్యాయత, ఆమె పంచిన ప్రేమ మన సైన్యానికి ఆదరువు. తనకు వీడ్కోలు పలికేటప్పుడు.. నుదుటిపై చేయి పెట్టి అమ్మ అందించిన దీవెన.. బ్రహ్మాస్ర్తాన్ని సైతం నిర్వీర్యం చేస్తుందన్న నమ్మకం వారిది. అయితే, తనకు ఉన్నవన్నీ బిడ్డకు ఇచ్చేసిన అమ్మకు యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రతిసారీ కఠోర పరీక్షే. అలాంటి విపత్కర పరిస్థితులు ఎన్ని ఎదురైనా, అన్నిసార్లూ తన కొడుకో, కూతురో యుద్ధం నుంచి క్షేమంగా తిరిగి వచ్చినా.. అమ్మను ఏదో భయం వెంటాడుతూనే ఉంటుంది. చిన్నప్పుడు ఎన్ని గండాలు దాటలేదు.. ఇదీ అంతే అని తనకు తాను ధైర్యం చెప్పుకొంటుంది.
బిడ్డ సైన్యంలో చేరితే ఇలాంటి రోజు వస్తుందని ఆ తల్లి ఊహించకుండా ఉండదు! తాను సైన్యంలో చేరుతానని కొడుకు కోరిన క్షణంలోనే ఆమె గుండె అగ్నిపర్వతంలా బద్ధలవుతుంది. కానీ, చిన్నప్పటి నుంచి వీరగాథలు చెప్పి పెంచిన తాను.. కొడుకు కోరికకు అడ్డు చెప్పడం ఏంటని మనసులోనే అనుకొని ఆల్ ద బెస్ట్ చెబుతుంది. కొందరి విషయంలో మరోలా ఉంటుంది. కొడుకో, కూతురో ఆర్మీలో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారని తెలియగానే సత్యాగ్రహం ప్రకటిస్తుంది. మౌనవ్రతం పాటిస్తుంది. తల్లిని బుజ్జగించో, విషయం దాచిపెట్టో వాళ్లు సైన్యంలో చేరిపోతారు. తర్వాత ఎప్పటికో విషయం తెలిసిన తల్లి పైకి నవ్వు ముఖంతో అభినందనలు తెలిపినా.. లోలోపల కుమిలిపోతుంది. ఆ రోజు నుంచి తన కన్నపేగు కదిలిపోతున్నట్టుగా కంగారుపడిపోతుంది. సెలవుల్లో వచ్చి డ్యూటీకి వెళ్తున్న ప్రతిసారీ నవ్వుతూ వీడ్కోలు పలికినా.. వాళ్లు కనుమరుగు కాగానే, పొగిలి పొగిలి దుఃఖిస్తుంది.
ఆ అమ్మే.. ‘నువ్వు ఈసారి వెళ్లడానికి వీళ్లేదని భీష్మిస్తే! లక్ష్మణ రేఖ గీస్తే! ఆర్మీ క్రమశిక్షణలో ఎంత రాటుదేలిన తల్లికి బిడ్డే కదా! ఆ మాతృమూర్తి ఆవేదనకు కరిగిపోతే.. సెలవుల్లో ఇండ్లకు వెళ్లిన సైనికుల్లో ఎంతమంది తిరిగి విధుల్లో చేరుతారో ఊహించడం కష్టమే! కానీ, ఆమె వీరమాత.. బిడ్డను దేశానికి అంకితం చేసింది. తల్లిని కన్న కన్నభూమిని తల్లి కన్నా మిన్నగా ప్రేమిస్తున్న సైనికుడికి జన్మనిచ్చినందుకు గర్విస్తుంది. పొరుగు దేశాలతో.. ఎప్పుడు యుద్ధం జరిగినా మనం గెలుపొందడం వెనుక ఈ తల్లుల అవ్యాజమైన దేశభక్తే ప్రధాన కారణం. ఆ వీరమాతలకు వందనాలు సమర్పించుకుందాం. మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేద్దాం!