నగరవాసుల్లో రానురానూ విపరీత ధోరణులు పెచ్చరిల్లుతున్నాయి. వివాహేతర సంబంధాలపై ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ప్రముఖ ఎక్స్ ట్రామారిటల్ డేటింగ్ యాప్ గ్లీడెన్ సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్లీడెన్ అధ్యయనం ప్రకారం.. దేశంలో వివాహేతర సంబంధాల కోసం ఎకువ మంది యాప్‌ను ఉపయోగిస్తున్న నగరంగా బెంగళూరు నిలిచింది. మొత్తం యూజర్లలో 18 శాతం మంది బెంగళూరుకు చెందినవారే కావడం గమనార్హం. 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు కలిగిన ఉద్యోగులు, వ్యాపారవేత్తలే ఈ ప్లాట్‌ఫామ్‌ను అధికంగా ఉపయోగిస్తున్నట్లు అధ్యయనం పేరొంది. 12 నగరాల్లో 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల 1510 మందిపై నిర్వహించిన ఈ సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అధ్యయనంలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలవగా.. మొత్తం యాప్ వినియోగదారుల్లో 17 శాతం మంది హైదరాబాద్‌కు చెందినవారే ఉన్నారట. ఆ తర్వాత ఢిల్లీ 11 శాతం, ముంబై 9 శాతం, పూణె 7 శాతంతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి. యాప్ వినియోగదారుల్లో 65 శాతం మంది పురుషులు, 35 శాతం మంది మహిళలు ఉన్నట్లు ఈ రిపోర్ట్ తెలిపింది.
భారతీయ వినియోగదారులు రోజుకు గంటన్నరపాటు ఈ తరహా యాప్‌లలో గడుపుతున్నారని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. కాగా.. చాలామంది కేవలం శారీరక సంబంధాల కోసం కాకుండా భావోద్వేగ పరమైన అనుబంధం కోసం ఈ తరహా ప్లాట్‌ఫామ్స్‌ను ఆశ్రయిస్తున్నట్లు, దాంపత్య జీవితంలో భావోద్వేగాల లోటు, భాగస్వామితో సరైన అనుబంధం లేకపోవడం, ఒంటరితనం లాంటి కారణాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని అధ్యయనం చెబుతున్నది. ఈ తరహా ప్లాట్‌ఫామ్‌లలో మహిళల భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరుగుతున్నదని ఈ అధ్యయనం వెల్లడించింది. గత రెండు సంవత్సరాల్లో మహిళా వినియోగదారుల సంఖ్య 148 శాతం పెరిగినట్లు గ్లీడెన్ పేరొంది. ఇది నగరాల్లో మానవ సంబంధాలపై మారుతున్న దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్న మహిళలు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌ను ఎకువగా ఉపయోగిస్తుండటం విశేషం. ఇదిలా ఉండగా ఒంటరితనం, భావోద్వేగ శూన్యత, జీవిత భాగస్వామి నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడమే ఈ పెడధోరణికి కారణమని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాటిని అధిగమించాల్సిన బాధ్యత ఇరువురిపైనా ఉందని సూచిస్తున్నారు.