ఆడవాళ్లలో రక్త వృద్ధికి సూచించే కూరగాయల్లో మొదటి స్థానంలో ఉంటుంది బీట్రూట్. అలాగని దాన్ని కీరా, క్యారెట్లలాగా అమాంతం తినడం అంత సులభం ఏం కాదు. అలాగని విటమిన్-సి తో పాటు ఐరన్, ఫోలేట్లాంటి ఎన్నో పోషకాలు ఉండే దీన్ని వదిలేయడమూ మంచి విషయమేం కాదు. అందుకే ఈ దుంపను సులభంగా ఆహారంలో భాగం చేసుకునే మార్గాలు చూద్దాం.
సలాడ్లు తినేప్పుడు బీట్రూట్ను తురిమి కలుపుకొని, దానితో పాటు చియా, అవిసెలాంటి గింజల్నీ జోడించుకుంటే మరీ వెగటు రాకుండా పచ్చి బీట్రూట్ని తినొచ్చు. అలాగే నారింజ, ఆపిల్లాంటి పండ్లతో కలిపి జ్యూస్‌లా చేసుకుని తాగినా మరిన్ని పోషకాలు శరీరానికి అందుతాయి.
కాస్త ఉడికించి మిక్సీ పడితే ఇడ్లీలు, దోశల పిండిలో కలుపుకొని లాగించొచ్చు. అలాగే కొబ్బరి తురుము, కొంచెం ఆవాలు, కరివేపాకు నూనెలో వేసి తరిగిన బీట్రూట్ ముక్కలు కూడా జోడించి స్టిర్‌ఫ్రై చేసి కూడా నేరుగా తినొచ్చు. పరాఠాల్లో స్టఫింగ్ కోసం ఆలూ బదులు బీట్రూట్ వాడొచ్చు.