ముఖం నల్లబడితే ట్యాన్ ప్యాక్ వేస్తాం. మురికి పడితే స్క్రబ్ చేస్తాం. మరి మనసు మసకబారితే ఏం చేయాలి. బయటి అందాన్ని మించి మనిషిని ప్రతిఫలింపజేసే మానసిక సౌందర్యాన్ని కాపాడుకోవాలిగా! అందుకోసం, మనసుకూ మెరుగు పెట్టాల్సిందే.
శ్వాస మీద ధ్యాస పెట్టడం, ధ్యానం చేయడం లాంటివి మదిలో గూడుకట్టుకున్న ప్రతికూలతలను బయటికి నెట్టేస్తాయి. దీంతో మనసు శుభ్రంగా తయారవుతుంది.
ఎదుటి వారిపట్ల ఎంత ఓపికగా, దయతో ఉంటామో మనపట్ల మనమూ అంతే సున్నితంగా వ్యవహరించాలి. ఇది, ముఖానికి ఆవిరి పట్టినట్టుగా.. మనసును తేట పరుస్తుంది.
దిగులు ఉందంటే మనం దేనికోసమో ఎదురు చూస్తూ ఉన్నట్టు. ఏ పని పూర్తి కావడానికో ఆరాటపడుతున్నట్టు. నిజానికి మనకు రాసి పెట్టి ఉంటే కచ్చితంగా, సరైన సమయంలో అది మన దగ్గరికి వస్తుంది. అందుకు తగ్గట్టుగా మనం సరైన స్థానంలోనే ఉన్నాం. తప్పకుండా మంచి ఫలితాన్ని అందుకుంటాం… అన్న విషయాన్ని పదే పదే మనసుకు చెప్పుకోవాలి. మనం నమ్మాలి. ఇది మనసును బ్యూటీ మాస్క్ వేసినట్టు మిలమిలలాడేలా చేస్తుంది.
కోపం, పగలాంటివి మనసులో పెట్టుకుంటే పక్కలో బల్లేన్ని ఉంచుకున్నట్టే. అవి మన ప్రశాంతతను విచ్ఛిన్నం చేస్తాయి. అందుకే వాటినీ స్క్రబ్ చేసుకోవాలి.
అంతా మంచే జరుగుతుందని నమ్మాలి. ఏ పరిస్థితిలో అయినా పాజిటివ్‌గా ఉండటం అన్నది మనసును మాయిశ్చరైజ్ చేసినంత మృదువుగా, హాయిగా ఉంచుతుంది.