ఇప్పుడు చాలామంది ముఖంపై అవాంఛిత రోమాలతో బాధపడుతున్నారు. హార్మోన్లలో లోపాలు, ఇతర ఆరోగ్య కారణాలతో.. ఈ సమస్యబారిన పడుతున్నారు. వీటిని తొలగించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది ‘వ్యాక్స్’ చేయించుకుంటున్నారు. అయితే.. వ్యాక్సింగ్ అనేది అన్నివేళలా మంచిదికాదని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
చర్మ తత్వాన్ని బట్టి వ్యాక్సింగ్ను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం అనేక సౌందర్య ఉత్పత్తుల సంస్థలు ‘వ్యాక్స్ స్ట్రిప్స్’ను అందిస్తున్నాయి. అయితే, ఇవి సున్నితమైన చర్మం ఉన్నవారిలో తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తాయట. వ్యాక్సింగ్ వల్ల చర్మంపై దద్దుర్లు రావడం, ఎర్రగా మారడం, ముడతలు పడటంతోపాటు చర్మం మరింత సున్నితంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తద్వారా ఎండలోకి వెళ్లినప్పుడు ముఖమంతా కందిపోవడం, ర్యాషెస్ వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కాబట్టి బయట దొరికే ఫేషియల్ వ్యాక్స్, ఇంట్లో తయారుచేసుకున్న ప్యాక్స్ వేసుకునే ముందు.. చర్మ తత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. దేన్నయినా ముఖంపై అప్లయి చేసుకునే ముందు ఓసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మేలని సలహా ఇస్తున్నారు.