 
                                                            అధరాలు ఆరోగ్యంగా ఉంటేనే.. ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. కానీ, చలికాలంలో పెదాలు పగిలి.. అందవిహీనంగా తయారవుతాయి. దాంతో ఏవేవో క్రీములు, మాయిశ్చరైజర్లు వాడుతుంటారు. అయితే, రసాయనాలతో తయారైన క్రీములతో పెదాల ఆరోగ్యం మరింత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అలాకాకుండా, ఇంట్లో దొరికే పదార్థాలతోనే పెదాలను సంరక్షించుకోవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
పగిలిన పెదాలు మళ్లీ పూర్వస్థితిలోకి రావాలంటే.. వాటిని కొద్దిగా స్క్రబ్ చేయాలి. పెదాలపై ఉండే మృతకణాలను తొలగించాలి. ఇందుకోసం పంచదార-తేనె స్క్రబర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక టీస్పూన్ తేనెలో.. అంతే పంచదార వేసి, బాగా కలపాలి. ఆ మిశ్రమంతో పెదాలపై మెల్లిగా స్క్రబ్ చేయాలి. దీంతో పెదాలు ఎక్స్ఫోలియేట్ కావడంతోపాటు మృదువుగా తయారవుతాయి. తేనెకు బదులుగా చక్కెరలో కొద్దిగా ఎసెన్షియల్ ఆయిల్ వేసి, పెదాలకు రాసినా.. మంచి ఫలితం కనిస్తుంది. అందంగా మారతాయి. అయితే, తేనె/ ఎసెన్షియల్ ఆయిల్లో పంచదార పూర్తిగా కరిగేలా చూడాలి. లేకుంటే, గరుకుగా ఉండే పంచదార స్ఫటికాలతో పెదాలకు గాయాలయ్యే అవకాశం ఉంటుంది.
ఇక పెదాలకు పోషణను ఇవ్వడంలో పాల మీగడను మించిన ఔషధం లేదు. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు.. అధరాలపై పాలమీగడ రాసి, మెల్లిమెల్లిగా మాయిశ్చరైజ్ చేయాలి. దీంతో పెదాలు హైడ్రేట్ కావడంతోపాటు పగలడం వల్ల ఏర్పడిన నలుపు కూడా తగ్గిపోతుంది. నెయ్యి కూడా చాలా పవర్ఫుల్ లిప్బామ్గా పనిచేస్తుంది. రాత్రి పడుకునేముందు పెదాలకు నెయ్యిని అప్లయి చేసుకొని.. ఉదయాన్నే కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తుంటే.. అధరాలు మృదువుగా తయారవుతాయి. సహజసిద్ధమైన ఈ రెమెడీలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి, ఈ చలికాలంలో ఈ చిట్కాలను రెగ్యులర్గా పాటించడం మంచిది.
 
                            