శాన్వి.. ఓ అందగత్తె.. ఒకసారి లెహెంగా కడుతుంది.. మరోసారి స్విమ్ సూట్ ధరిస్తుంది.. ఆ ఫొటోలన్నీ ఇన్‌స్టాలోనూ పెడుతుంది.. ఇంకేం… వేల మంది ఫాలోవర్లు.. ఆమె ఓ ఇన్ఫ్లూయెన్సర్! ఇవన్నీ నిజం… కానీ ఆమె ఒక్కటే నిజం కాదు. ఎందుకంటే శాన్వి ఏఐ సృష్టించిన ఓ అందం. నిజంలా కనిపించే అబద్ధం. ఉన్నట్టు అనిపించే భ్రమ. వర్చువల్ ఇన్ఫ్లూయెర్స్ ఇప్పుడు ట్రెండ్. కృత్రిమ మేధ సృష్టించిన శాన్వి ఇప్పుడందులో ట్రెండ్ సెట్టర్!
ఇన్ఫ్లూయెన్సర్… నేడు ఓ హోదా. సినిమా యాక్టర్లకు మించిన స్టార్డమ్ వీళ్ల సొంతం. వీళ్లు ఓ మోడల్ డ్రెస్ ధరిస్తే అది ట్రెండయిపోతుంది. ఓ ఉత్పత్తిని సూచిస్తే క్షణాల్లో సేల్ అయిపోతుంది. ఫ్యాషన్‌కి వేదిక ఇన్‌స్టా అయితే… అందులో ప్రధాన పాత్రధారులు ఇన్‌ఫ్లూయెన్సర్లే. అందుకే కృత్రిమ మేధ… ఈవైపు దృష్టి సారించింది. తన శక్తినంతా వినియోగించి
వర్చువల్ మనుషుల్ని తయారు చేస్తున్నది. ఆ కోవలోనిదే శాన్వి కూడా. భారతదేశపు మొట్టమొదటి వర్చువల్ ఇన్ఫ్లూయెన్సర్ ఆమె. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాకు ఎనభై వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
అరంగేట్రం అక్కడే…
శాన్వి అరంగేట్రం అందరు మోడళ్లలా… ర్యాంప్ వాక్తోనో, లైఫ్‌ైస్టెల్ మ్యాగజీన్ పేజీల్లోనో ప్రారంభం కాలేదు. ఆమె ఫ్యాషన్ ఇండస్ట్రీకి వచ్చిన తీరు వినూత్నం. క్లిష్టతరమైన కంప్యూటర్ కోడ్లు, కష్టసాధ్యమైన గ్రాఫిక్ డిజైన్ సాఫ్ట్వేర్ల మధ్య రూపుదిద్దుకుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ప్రాణం పోసుకుంది. ఫ్యాషన్ ఇండస్ట్రీకి చెందిన నిపుణులు ఆమె రూపు రేఖల్ని నిర్ణయించారు. అలా ఆమె అందరి ముందూ ప్రత్యక్షం అయింది. అందుకే ఆమెకు ఇలాంటి డ్రెస్సే నప్పుతుందన్న ఇబ్బంది లేదు. ఈ రంగులే బాగుంటాయన్న పరిమితీ లేదు. వయసు అయిపోతుందన్న భయమూ లేదు.
ఏ డ్రెస్‌లో ఎప్పుడైనా ఎలాగైనా చూడచక్కగా కనిపించగలదు. ఒక రకంగా చెప్పాలంటే ఆమె ఓ ఫ్యాషన్ ఊసరవెల్లి. ఒకే సమయంలో రకరకాల డ్రెస్‌లు వేసుకుని కనిపించగలదు. అటు సంప్రదాయ దుస్తుల్లోనూ, ఇటు పర్ఫెక్ట్ ఫ్యాషనబుల్ డ్రెస్సుల్లోనూ ఆమె తనను తాను ప్రత్యేకంగా ఆవిష్కరించుకుంటుంది. చూడగానే మనమూ వేసుకుంటే బాగుండు అనిపించేలా ఇన్ఫ్లూయెన్స్ చేసేంతటి హావభావాలు, ఆహార్యం శాన్వి సొంతం. ఆ కారణంగానే శాన్వి సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ అయింది. వేల మంది ఫాలోవర్లను సొంతం చేసుకుంది. అంతేకాదు, వాళ్ల మెసేజ్‌లకు రిైప్లెలు ఇస్తూ అభిమానులతో స్నేహంగా ఉంటుంది కూడా.
Sanvi
ఎల్లలు లేవు…
ప్రస్తుతం సోషల్ మీడియా… జనాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న మాధ్యమం. ఇది రాజ్యమేలుతున్న రంగాల్లో ఫ్యాషన్ ఒకటి. నగలు, దుస్తులు,యాక్సెసరీలు… ఏం కొనాలన్నా, ఏ ట్రెండు తెలుసుకోవాలన్నా ఇదే దారి. ముఖ్యంగా ఇన్‌స్టా అని ముద్దుగా పిలుచుకునే ఇన్స్టాగ్రామ్ దీనికి అతి పెద్ద వేదిక. ఇందులో ఫ్యాషన్ గురించి చెప్పి, ఆయా దుస్తులు యాక్సెసరీలను ధరించి చూపించే ఇన్‌ఫ్లూయెన్సర్లదే ఇప్పుడు హవా. ఇంత ప్రాధాన్యమున్న రంగం కాబట్టే కృత్రిమ మేధ కూడా ఇక్కడ తన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నది.
వర్చువల్ ఇన్ఫ్లూయెన్సర్లను తయారు చేస్తూ ఫ్యాషన్ ప్రమోషన్‌కి కొత్త నిర్వచనం చెబుతున్నది. ఏఐ సృష్టించిన శాన్వి అసలైన భారతీయ అమ్మాయిలా కనిపిస్తుంది. కట్టు బొట్టు హావభావాలన్నీ నిజమైన మనిషిలాగే ఉంటాయి. చక్కగా పరికిణీ ఓణీ కట్టుకుంటుంది. చుడీదార్ వేసుకుంటుంది. జిమ్సూట్లో చెమట చిందిస్తుంది. ఏం చేసినా వావ్ అనిపించే ఫ్యాషనబుల్ లుక్ ఆమె సొంతం.
నిజానికి ఇక్కడే శాన్వికీ సాధారణ ఇన్ఫ్లూయెన్సర్లకీ తేడా ఉంది. శాన్వి ధరించే డ్రెస్‌ల విషయంలో, నిజజీవితంలో ఆవిష్కరించి చూపించలేని అనేక మోడళ్లను వర్చువల్‌గా రూపొందిస్తున్నారు డిజైనర్లు. బయట కనిపించని రకరకాల రంగులనూ, ఊహ కందని మెరుపులను ఈ దుస్తుల్లో చూపగలుగుతున్నారు. ఇక్కడ భూమ్యాకర్షణ ఉండదు.. కాబట్టి లెహంగా కుచ్చులు కిందివైపే ఉండాలన్న నియమేం లేదు. అందంగా గాల్లో తేలుతూ ఉండవచ్చు. అలా…ఎల్లలు లేని ఎన్నో ప్రయోగాలకు శాన్వి ఓ మోడల్. ఫ్యాషనిస్టుల ఊహలకు ప్రతీక. ఇలాంటి ప్రత్యేకతలెన్నో జనాన్ని కట్టిపడేస్తున్నాయి. శాన్వి అందమైన అబద్ధం… అని నమ్మిన వాళ్లే నమ్మకంగా ఆమెను ఫాలో అవుతున్నారు. ఇది డిజిటల్ యుగపు గమ్మత్తు కదూ!
ఇన్స్టాగ్రామ్ ఐడీ
me.sanvii