ఒంటికి నలుగు పెట్టుకోవడం తాతమ్మల కాలం నుంచీ వస్తున్నది. ముఖ్యంగా, చలికాలంలో చర్మ సంరక్షణలో ‘నలుగు పిండి’ అత్యద్భుతంగా పనిచేస్తుంది. అయితే, నవతరం మాత్రం ఈ నలుగుకి కాస్త దూరంగానే ఉంటున్నది. వారికోసం.. అదే నలుగు పిండికి మరో నాలుగు ద్రవ్యాలు కలిపి, సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్స్ అందిస్తున్నారు బ్యుటీషియన్లు.
శనగపిండిలో యాంటి బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలం. ముఖంపై జిడ్డును తొలగించడం, మొటిమలను నివారించడం, చర్మ రంధ్రాలను శుభ్రపరచడంలో.. శనగపిండి ముందుంటుంది. చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మార్చే సహజమైన క్లెన్సర్‌గానూ పనిచేస్తుంది. ముడతలు తగ్గించి, చర్మాన్ని బిగుతుగా మార్చేస్తుంది. ఈ ఫలాలు పొందాంటే.. శనగపిండితో చేసుకునే కొన్ని ఫేస్‌ప్యాక్‌లను ఆశ్రయిస్తే సరి.
ఒక టేబుల్ స్పూన్ శనగపిండిలో అర టీస్పూన్ గంధం, కొద్దిగా పాలు కలపాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లయి చేసి.. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఈ ఫార్ములాను వారంలో మూడునాలుగు సార్లు ఫాలో అయితే, మంచి ఫలితం కనిపిస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిలో ఒక టేబుల్‌స్పూన్ ముల్తానీ మట్టి, ఒక టీస్పూన్ కాఫీ, నిమ్మరసం, రెండు టీస్పూన్ల పెరుగు వేసి, బాగా కలపాలి. ఈ ఫేస్‌మాస్క్‌ను ముఖానికి, మెడకు బాగా అప్లయి చేసి, సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే.. ట్యాన్ తగ్గిపోతుంది. ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
ముఖంపై మచ్చలను తొలగించడంలో.. శనగపిండి-తేనె ప్యాక్ ముందుంటుంది. ఒక టేబుల్ స్పూన్ శనగపిండిలో ఒక టీస్పూన్ తేనె, అర టీస్పూన్ పాలు కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకొని, 20 నిమిషాల తర్వాత కడిగేస్తే.. బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. చర్మం మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది.
ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి, మూడు టేబుల్ స్పూన్ల పెరుగు, చిటికెడు పసుపు తీసుకొని.. బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవాలి. ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేసుకొని, 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఈ ఫేస్‌ప్యాక్ వల్ల చర్మానికి అదనపు తేమ, మృదుత్వం లభిస్తుంది.