ఒకప్పుడు పర్సు.. సూట్‌కేస్.. లాంటివి పోతాయేమోనని ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే వాళ్లం. ఇప్పుడు? ఎప్పటికప్పుడు జేబు చెక్ చేసుకుంటున్నాం.. ఫోన్ ఉందో? లేదో? అని. ఇంతలా స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన వస్తువులా మారిపోయింది. అందుకే స్మార్ట్‌ఫోన్ సెక్యూరిటీ విషయంలో తయారీ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. ఓఎస్‌లో అందుకు తగిన స్మార్ట్ ఫీచర్లను జోడిస్తున్నాయి. త్వరలో అందుబాటులోకి రానున్న 15 వెర్షన్లోనూ ఫోన్ సెక్యూరిటీకి ఆండ్రాయిడ్ పెద్దపీట వేసింది. ‘ఐడెంటిటీ చెక్’ ఫీచర్‌ని పరిచయం చేయనుంది. ఐఓఎస్‌లో ఉన్న ‘స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్’ లాంటిదే ఈ ఫీచర్. ఇది ఓ నిఘా వ్యవస్థలా పని చేస్తుంది.
వినియోగదారులు ఫోన్‌ని రోజూ ఏయే లొకేషన్స్‌లో వాడుతున్నారు? ఏయే అవసరాలకు ఉపయోగిస్తున్నారు? ఏ వేళల్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు?… లాంటి అనేక విషయాల్ని నిరంతరం ట్రాక్ చేస్తుంది. ఎప్పుడైనా అనుకోకుండా ఫోన్ ఏదైనా కొత్త లొకేషన్ని డిటెక్ట్ చేస్తే.. తక్షణం అలర్ట్ అవుతుంది. వెంటనే యూజర్ ఎవరనేది తెలుసుకునేందుకు ఫోన్ లాక్ చేస్తుంది. యూజర్ బయోమెట్రిక్ లేదా ఫేస్ డిటెక్షన్‌ని అడుగుతుంది. వచ్చిన ఇన్‌పుట్‌ని ప్రాసెస్ చేసి యూజర్ వెరిఫికేషన్ చేశాకే.. ఫోన్ అన్‌లాక్ అవుతుంది.
ఇదెంత స్ట్రాంగ్‌గా పని చేస్తుందంటే.. పిన్ నెంబర్ ఎంటర్ చేశాక కూడా.. ‘ఐడెంటిటీ చెక్’ తర్వాతే అన్‌లాక్ అవుతుంది. దీంతో ఎవరైనా ఫోన్ దొంగిలిస్తే.. డేటా ఎవరి కంటా పడకుండా జాగ్రత్త పడొచ్చు అన్నమాట. మరో విషయం ఏంటంటే.. కొత్త వెర్షన్ ఆండ్రాయిడ్ 15లో కస్టమైజేషన్‌కు అధిక ప్రాధాన్యమిస్తూ ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నారట. దీంతో యూజర్లు వారివారి అవసరాలకు తగినట్టుగా ఓఎస్‌లో మార్పులు చేసుకోవచ్చు.