లాస్య.. పరిచయం అక్కర్లేని యాంకర్. ఇంజినీరింగ్ చదివిన ఈ అమ్మాయి యాంకర్‌గా ఇండస్ట్రీని ఏలేసింది. లాస్య జీవితం ఆమె నవ్వంత హాయిగా ఏం సాగలేదు. చేతినిండా కార్యక్రమాలతో బిజీగా ఉండే లాస్య చేతిలో రూపాయి లేని రోజులను కూడా గడిపింది. ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని బుల్లితెరపై తనకంటూ ఓ ఇమేజ్ను సొంతం చేసుకుంది. తాజాగా జీ తెలుగులో ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ సీజన్ 8లో మెంటర్‌గా అలరిస్తున్న లాస్య మంజునాథ్ తన జీవితంలో ఒడుదొడుకుల గురించి జిందగీతో పంచుకున్న ముచ్చట్లు ఆమె మాటల్లోనే..
మాది కడప జిల్లా రాయచోటి. మా బాబాయి హైదరాబాద్‌లో ఓ స్కూల్ హెడ్మాస్టర్గా చేసేవారు. వాళ్లకు పిల్లలు లేకపోవడంతో నాకు మూడేండ్లు ఉన్నప్పుడే ఇక్కడికి తీసుకొచ్చారు. బాబాయి వాళ్లింట్లోనే పెరిగా. నారాయణగూడలోని మాడపాటి హనుమంతరావు స్కూల్లో పదో తరగతి వరకు చదివా. ఇంటర్ తిరుపతిలో చేశా. ఎన్సీసీలో గోల్డ్ మెడల్ రావడంతో స్పోర్ట్స్ కోటాలో సీబీఐటీ కాలేజ్‌లో ఇంజినీరింగ్ సీట్ వచ్చింది. ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉండగా మా కాలేజీలో ‘హ్యాపిడేస్’ సినిమా షూటింగ్ జరిగింది. అందులో ఓ పాత్ర అవకాశం వచ్చింది. చిన్నరోల్ అని ఒప్పుకోలేదు. కానీ, ఆ సినిమా పెద్ద హిట్ అవడంతో ‘చేయాల్సింది కదా!’ అనిపించింది. అప్పట్నుంచి ఎక్కడైనా ఆడిషన్స్ జరిగితే వెళ్లేదాన్ని. అలా జెమినీ మ్యూజిక్‌లో మొదటిసారి యాంకర్‌గా అవకాశం వచ్చింది. కొన్నాళ్లకు జీ తెలుగులో ‘మీ ఇంటి వంట షో’ ఆఫర్ వచ్చింది. తర్వాత ‘సంథింగ్ స్పెషల్’ షో ద్వారా చాలా మంచి పేరొచ్చింది. మొదట్లో యాంకరింగ్ చేస్తూ గూగుల్‌లో జాబ్ చేసేదాన్ని. అయితే అవకాశాలు పెరుగుతున్న కొద్దీ రెండూ చేయడం కష్టమవుతున్నదని ఉద్యోగం మానేశా.
అమ్మానాన్నకు ఈ ఫీల్డ్ గురించి అస్సలు తెలియదు. నేను ఇండస్ట్రీకి వస్తానంటే నాన్న చాలా సీరియస్ అయ్యారు. అస్సలు వద్దన్నారు. కానీ, వరుస షోలు, ఆడియో రిలీజ్లు, స్టేజ్ షోల్లో అవకాశాలు రావడం చూసి వాళ్లెంతో సంతోషించారు. సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. రెండు మూడు సినిమాల్లో నటించాను. ఎమ్మెల్యే సినిమాలో కళ్యాణ్‌రామ్ గారి చెల్లెలిగా చేశా. ఎందుకో సినిమాల్లో నటించడం నాకు సరిపడదు అనిపించింది. షూటింగ్లో చేసిన సీన్లు కొన్ని.. సినిమా దగ్గరికి వచ్చేసరికి ఎడిటింగ్‌లో పోయేవి. చాలా బాధగా అనిపించేది. అందుకే సినిమాలు దూరంపెట్టాను. బుల్లితెర కెరీర్లోనూ చాలా బ్రేక్స్ తీసుకున్నా. పెండ్లికి ముందే యాంకరింగ్ మానేశా. మళ్లీ కొన్నాళ్లు చేశా. పెద్దబాబు పుట్టినప్పుడు, చిన్నబాబు పుట్టినప్పుడు గ్యాప్స్ తీసుకున్నా. ఎన్నిసార్లు విరామం తీసుకున్నా.. ప్రేక్షకుల అభిమానం మాత్రం మారలేదు. ఓసారి ఖమ్మంలో ఒక షో చేస్తుంటే ఒక అమ్మాయి వచ్చి ముద్దు పెట్టేసింది. కొంతమంది వచ్చి చేయిపట్టుకుంటారు. అంతగా ప్రేమిస్తారు. ఇండస్ట్రీలో కొన్నాళ్లు కనిపించకపోతేనే అందరూ మర్చిపోతారు. మనం కాకపోతే ఇంకొకరు రెడీగా ఉంటారు. నా విషయంలో మాత్రం అభిమానుల ఆదరణ చెక్కు చెదరలేదు. దాదాపు రెండుమూడేండ్ల గ్యాప్ తర్వాత బిగ్‌బాస్‌లో కనిపించా! అయినా, ప్రేక్షకులు నన్నెంతగానో ఆదరించారు. ప్రస్తుతం డీజే ప్రోగ్రామ్‌లో మెంటర్‌గా చేస్తున్నాను. ఆ షోలో పిల్లల్ని చూసి చాలా నేర్చుకోవాలి. చాలా బాగా కలిపేసుకుంటారు. పేజీలు పేజీల డైలాగ్‌లు కట్ లేకుండా బాగా చెప్పేస్తారు. ఆ పిల్లలను పేరెంట్స్ ప్రోత్సహిస్తున్న తీరు గొప్పగా అనిపిస్తుంటుంది.
మాది ప్రేమ వివాహం. కానీ, మా ఆయన చాలా అబద్ధాలు చెప్పి మోసం చేసి పెండ్లి చేసుకున్నారని తర్వాత తెలిసింది. వాటన్నిటినీ అధిగమించి మా జీవితాన్ని అందంగా మలుచుకోవడానికి ఏడెనిమిదేండ్లు పట్టింది. మా ఆయన చాలా సపోర్టివ్. ఏదైనా ట్రోల్ వస్తే రియాక్ట్ అవ్వకూడదని అంటారు. మోటివేషనల్ వీడియోలు చేయాలని ఉంది. కానీ ‘నువ్వు చెప్తే ఎవరు నమ్ముతారు?’ అంటారాయన. ఎందుకంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండే నేను మోటివేషనల్ రీల్స్ చేస్తే ఎవరూ నమ్మరనేది మా ఆయన వాదన. మా వారే నమ్మరు. మిగిలిన అన్ని విషయాల్లో చాలా సపోర్టివ్‌గా ఉంటారు. అమ్మ సహకారంతో పిల్లలను చూసుకుంటూ షోస్ చేయగలుగుతున్నా. ఫ్యామిలీకి ఎక్కువ సమయం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఎక్కువ కార్యక్రమాలు ఒప్పుకోవడం లేదు. నా తొలి ప్రాధాన్యం కుటుంబమే!
నేను యూట్యూబ్‌లో చానెల్ పెట్టినప్పుడు నాకసలు దాని గురించి ఏం తెలీదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో చాలా ఖాళీగా ఉండేదాన్ని. ప్రెగ్నెన్సీ టైమ్‌లో తీసుకునే జాగ్రత్తల గురించి యూట్యూబ్‌లో సెర్చ్ చేసేదాన్ని. కానీ దాంట్లో కంటెంట్ అంతా హిందీ, ఇంగ్లిష్‌లో ఉండేది. దాంతో ప్రెగ్నెన్సీ వాళ్లకి ఎలాంటి కేర్, ఫుడ్ అవసరమో చెప్పాలనుకున్నా. మావారికి చెబితే చానెల్ క్రియేట్ చేశారు. కెమెరా రెంట్‌కు తీసుకొని షూట్ చేసేదాన్ని. మొదటి పేమెంట్ రూ.35వేలు వచ్చాక గానీ, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని నమ్మలేదు. చాలామంది నా గురించి చాలా రకాలుగా మాట్లాడారు. దేనికీ నేను ఎక్కువగా రియాక్ట్ అవ్వను. ఎవరైతే నన్ను ఎగతాళి చేశారో.. ఇప్పుడు వాళ్లు యూట్యూబ్ చానెల్స్ స్టార్ట్ చేశారు. సమయమే అన్నిటికీ సమాధానం చెబుతుందని నమ్ముతాను.